#ఆదిపురుష్ 3డి .. సీత పాత్రకు ఫిక్సయినట్టేనా?!

0

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం ట్రెండీ టాపిక్. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా ఇది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా రావణుడి పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ని ఎంపిక చేశారన్న కథనాలొచ్చాయి.

ఇంతకీ సీత ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సరైన ఆన్సర్ లేదు. సీత పాత్రకు పలువురు నాయికల పేర్లను పరిశీలించిన ఓంరౌత్ తాజాగా కృతి సనోన్ ని ఫైనల్ చేశారని కథనాలొస్తున్నాయి. కృతి తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు మహేష్ సరసన `1నేనొక్కడినే`.. నాగచైతన్య సరసన `దోచేయ్` చిత్రాల్లో నటించింది.

ఇప్పుడు క్రేజీగా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ దక్కించుకుంటోందన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే కృతి ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి బాలీవుడ్ మీడియా కథనాల్లో కృతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కృతి ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆదిపురుష్ 3డిని అత్యంత భారీ బడ్జెట్ తో టీసిరీస్ నిర్మించనుంది.