Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘కలిసుందాం రా’ క్లైమాక్స్ మార్చడానికి కారణమదేనట!

‘కలిసుందాం రా’ క్లైమాక్స్ మార్చడానికి కారణమదేనట!


కథా రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కి ఎంతో అనుభవం ఉంది. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న ఘనత వారి సొంతం. అలాంటి పరుచూరి బ్రదర్స్ .. రామానాయుడు నిర్మాణంలో అనేక సినిమాలకు పనిచేశారు. కథల విషయంలో రామానాయుడిని ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే ఒక కథలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఏయే పాళ్లలో ఉండాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన కథలు వినేవారు. అలాంటి రామానాయుడితో కలిసి పరుచూరి బ్రదర్స్ సుదీర్ఘ కాలం పాటు పనిచేయడం విశేషం. అందువలన ఇటు రామానాయుడుతోను .. అటు సురేశ్ బాబుతోను వాళ్లకి ఎంతో అనుబంధం ఉంది. ఈ వారం ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో రామానాయుడు – సురేశ్ బాబును గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

“ఓ సారి రామానాయుడు గారు మమ్మల్ని పిలిచి కృష్ణ – శోభన్ బాబులతో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టుగా చెప్పారు. ఐదు వేల రూపాయలకి ‘చెక్’ రాసి మా చేతిలో పెట్టారు. అప్పట్లో అది పెద్దమొత్తం కావడంతో నేను మా అన్నయ్య ఆశ్చర్యంతో ఒకరి ముఖాలను ఒకరం చూసుకున్నాము. అలా ఆయన కోసం మేము ‘ముందడుగు’ కథను రాయడం జరిగింది. రామానాయుడుగారికి కథ నచ్చింది .. కానీ టైటిల్ నచ్చలేదు. “మేము ‘ముందడుగు’ సినిమాతో ముందడుగు వేయిద్దామని అనుకుంటూ ఉంటే మీరేంటండి వెనకడుగు వేస్తున్నారు” అని సరదాగా మా అన్నయ రామానాయుడిగారితో అన్నాడు. అందుకు ఆయన నవ్వుతూ ” భలే సెంటిమెంట్ మీద కొట్టావయ్యా” అంటూ ఒప్పేసుకున్నారు.

ఏ సినిమాకైనా కథే ప్రాణం .. అందువలన కథ విషయంలో రామానాయుడుగారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. కథా చర్చల్లో రామానాయుడిగారితో పాటు సురేశ్ బాబు .. వెంకటేశ్ ఇద్దరూ కూడా పాల్గొనేవారు. రామానాయుడు గారు ఒక్కోసారి కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి కథ వినిపించేవారు. అలాగే కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ‘రషెస్’ చూపించేవారు. అలాగే ఆయన ‘కలిసుందాం రా’ రషెస్ ను కుటుంబ సభ్యులందరికీ చూపించారు. అలా రషెస్ చూసిన సురేశ్ బాబుగారి భార్య మొదటి నుంచి సినిమా చాలా బాగా వచ్చింది కానీ క్లైమాక్స్ బాగోలేదని చెప్పారట. దాంతో సురేశ్ బాబుగారు నాకు కాల్ చేసి ఆ విషయం చెప్పారు. దాంతో మేము క్లైమాక్స్ ను మార్చడం జరిగింది. అందువల్లనే ఆ సినిమా అంత సూపర్ హిట్ అయింది .. లేకపోతే ఆ స్థాయిలో ఆడేది కాదేమో” అంటూ ఆనాటి విషయాలను చెప్పుకొచ్చారు.