Templates by BIGtheme NET
Home >> Cinema News >> చెన్నకేశవ రెడ్డి నిరాశ పర్చడం పై పరుచూరి పలుకులు

చెన్నకేశవ రెడ్డి నిరాశ పర్చడం పై పరుచూరి పలుకులు


యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా వివి వినాయక్ నిలవడానికి ప్రధాన కారణం ఆయన మొదటి రెండు సినిమాలు అయిన ఆది మరియు చెన్నకేశవ రెడ్డి. ఆది సినిమా సూపర్ హిట్ అవ్వగా చెన్నకేశవ రెడ్డి సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. అయితే చెన్నకేశవ రెడ్డి కథ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల సినిమా నిరాశ పర్చింది అంటూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తన పరుచూరి పలుకులు వీడియోలో ఈసారి చెన్నకేశవ రెడ్డి సినిమా గురించి పరుచూరి మాట్లాడారు. సినిమా లో చిన్న చిన్న తప్పులు జరిగాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో చేసిన తప్పుల కారణంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా కాస్త యావరేజ్ గా నిలిచిందని అన్నాడు. సినిమా ప్లాష్ బ్యాక్ విషయంలో తప్పు దొర్లినట్లుగా ఆయన పేర్కొన్నాడు. తాను ఆ సమయంలో డాక్టరేట్ తీసుకునే పనిలో ఉన్న కారణంగా నేను చెన్నకేశవ రెడ్డిపై శ్రద్ద పెట్టలేక పోయాను. స్క్రిప్ట్ సమయంలో సమయం కేటాయించక పోవడం వల్ల తప్పులు సరి చేయలేక పోయాను అన్నాడు.

చెన్నకేశవ రెడ్డి సినిమా ప్లాష్ బ్యాక్ ను చాలా ఆలస్యంగా చూపించడం చాలా పెద్ద తప్పు. ప్రథమార్థంలోనే ప్లాష్ బ్యాక్ ఉండి ఉంటే ప్రేక్షకులు సినిమా మొత్తంను కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చూసేవారు. ఇక పెద్ద బాలయ్య ఎంట్రీ కూడా చాలా సింపుల్ గా ఒక ఫైట్ తో ఇచ్చారు. అసలు ఆ ఫైట్ ఎందుకు వస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇక బాలకృష్ణ అన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం పట్ల శివకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉన్నతాధికారులతో మాట్లాడి విడిపించడం కూడా మరీ సిల్లీగా అనిపించింది. చట్టపరంగా విడుదల చేయించాల్సి ఉంది.

ఇక చిన్న బాలకృష్ణ తండ్రికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం.. టబు భర్త కోసం అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడం అది కూడా కొడుకు బాలకృష్ణ వల్ల అవ్వడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. మొత్తానికి కథ మంచిదే అయినా స్క్రీన్ ప్లే నడిపించడంలో తప్పులు ఉండటం వల్ల బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన చెన్నకేశవ రెడ్డి సాదా సీదా సినిమాగా నిలిచింది అంటూ పరుచూరి వారు చెప్పుకొచ్చారు.