300 రోజులు వెనక్కి వెళ్లిపోయాడుగా..!

0

యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ”30 రోజుల్లో ప్రేమించటం ఎలా?”. యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.వీ బాబు నిర్మించారు. ప్రదీప్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని తెలుగు డిస్ట్రీబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. గత ఎనిమిది నెలలుగా కొత్త సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అవుతుండటంతో ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ మూవీ కూడా డిజిటల్ రిలీజ్ కి రెడీ కానుందని వార్తలు వచ్చాయి.

అయితే ఇన్నాళ్ళు థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన మేకర్స్.. లాక్ డౌన్ తరువాత థియేటర్స్ లోనే రిలీజ్ చేయడానికి గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడప్పుడే ప్రదీప్ సినిమాకి థియేటర్స్ దొరికే అవకాశం లేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు రిలీజ్ స్లాట్స్ కోసం క్రేజీ ప్రాజెక్ట్స్ పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ప్రదీప్ సినిమాకి స్లాట్ దొరకడం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ కి తెలుగు రాష్ట్రాల్లో లేడీ ఫాలోయింగ్ ఉందనుకుంటే ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తే సరిపోతుంది కదా అని కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే లేడీ ఆడియెన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ కి రావడం కష్టమే. వాళ్లంతా ప్రస్తుతానికి హోమ్ స్క్రీన్ మీద సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ డెబ్యూ మూవీని థియేట్రికల్ రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి.