పవన్ ఇష్టం.. ఆయన రాజకీయం కష్టం

0

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఊసరవెళ్లి అంటూ విమర్శించాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. అది పెద్ద దుమారం రేపింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి నాగబాబు పవన్ ఫ్యాన్స్ తో ప్రకాష్ రాజ్ కు కాస్త గట్టిగానే మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ప్రకాష్ రాజ్ స్పందించారు. తన వాదనను సమర్థించుకున్నారు.

పవన్ కళ్యాణ్ తో సైద్ధాంతిక అభిప్రాయభేదాలు తప్పితే తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి బేధాలు ఉండవని ప్రకాష్ రాజ్ అన్నాడు. పవన్ సిద్ధాంతాలతో తాను ఏకీభవించనని.. పొలిటికల్ గా మా మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చని అన్నారు.

‘పవన్ అంటే నాకిష్టం.. కానీ రాజకీయాల్లో కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నాయి. ఇదే విషయం ఆయనతో కూడా చెప్పాను’ అని ప్రకాష్ రాజ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీలో కూడా తాను నటిస్తున్నానని.. కీలక పాత్ర పోషిస్తున్నానని.. మేము షూటింగ్ లో రాజకీయాల గురించి చర్చించుకుంటామని.. షూట్ అనగానే మళ్లీ కలిసిపోతామని ప్రకాష్ అన్నారు. సెట్స్ లో ఇదివరకే మా పాయింట్ల మీద మేము తీవ్రంగా డిస్కస్ చేశామని ప్రకాష్ చెప్పుకొచ్చారు.

నేను రాసిన ‘దోసిట చినుకులు’ అనే పుస్తకాన్ని కూడా ‘వకీల్ సాబ్’ షూటింగ్ సందర్భంగా పవన్ మెచ్చుకున్నాడని.. మా మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చాడు.