‘పుష్ప’ లాంగ్ షెడ్యూల్ ఫిక్స్

0

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న పుష్ప సినిమా ఏడాది కాలంగా అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభించాలని సుకుమార్ భావించాడు. బన్నీ లేకుండా ఒక షెడ్యూల్ కూడా కేరళలో చేశాడు. మార్చిలో బన్నీ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని భావించాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల ఏకంగా ఎనిమిది నెలలు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వైజాగ్ మరియు గోదావరి జిల్లాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో సుకుమార్ అండ్ టీం ఉన్నారు. ఇక మొదట్లో అనుకున్నట్లుగా కేరళలో కూడా కొన్ని రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారు. అయితే అందుకు మరికాస్త సమయం పట్టనుంది. హైదరాబాద్ లో ఇండోర్ షూటింగ్ సెట్ షూటింగ్ ఇలా అన్నింటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఒక్క సారి సినిమా షూటింగ్ ప్రారంభం అయితే బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా అయిదు నెలల పాటు చిత్రీకరణ జరపాలనే నిర్ణయానికి బన్నీ మరియు సుకుమార్ లు వచ్చారు.

వచ్చే ఏడాది దసరా సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేసేలా సుకుమార్ పక్కా షెడ్యూల్ ను ఫిక్స్ చేశాడట. బన్నీ.. రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. వీరిద్దరు కూడా చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. కెరీర్ లో మొదటి సారి చాలా విభిన్నమైన పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడు. ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ తదుపరి సినిమాతో కూడా మరో విజయాన్ని దక్కించుకోవాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.