తెరపైకి మరో క్రేజీ బయోపిక్.. ఈ సారి రతన్ టాటా జీవిత కథతో!

0

వెండితెరపైకి బయోపిక్ లు వరుస కడుతున్నాయి. గత కొన్నేళ్లుగా అన్ని సినీ ఇండస్ట్రీల్లో వరుసగా బయోపిక్ లో తెరకెక్కుతున్నాయి. సక్సెస్ రేటు అధికంగా ఉండడంతో ఈ సినిమాల నిర్మాణానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపినాథ్ కథతో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా.. సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వెండితెరపై మరిన్ని బయోపిక్ ల నిర్మాణానికి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే కపిల్ దేవ్ కథతో 83 సినిమా నిర్మాణంలో ఉండగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ తమిళనాడు మాజీ సీఎం జయలలిత కథలతో బయోపిక్ లో నిర్మాణం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలపై కూడా ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.

తాజాగా మరో ఆసక్తికరమైన బయోపిక్ నిర్మాణానికి తెర లేచింది. భారతీయ కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రతన్ టాటా పాత్రల్లో ప్రముఖ తమిళ నటుడు మాధవన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఏ పాత్రనైనా సులువుగా పోషించగల సత్తా ఉన్న నటుడు మాధవన్. వ్యాపార పరంగా ఎన్నో విజయాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా బయోపిక్ చేపట్టనుండటం టాటా పాత్రకు మాధవన్ ను తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు పై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.