Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంక్రాంతి బరిలో రవితేజ – రానా – రామ్..!

సంక్రాంతి బరిలో రవితేజ – రానా – రామ్..!


కోవిడ్ నేపథ్యంలో మూతబడిపోయిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ అవుతుండటంతో కొత్త సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ క్రిస్మస్ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రాబోయే సంక్రాంతి పండుగను సినిమా పండుగగా మార్చడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన క్రేజీ మూవీస్ అన్నీ ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాయి. మాస్ మహారాజ్ రవితేజ – శృతి హాసన్ జంటగా నటించిన ”క్రాక్” చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఠాగూర్ మధు నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ”రెడ్” కూడా ఫెస్టివల్ సీజన్ లోనే రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన రామ్ ‘రెడ్’ సినిమాని సంక్రాతి బరిలో నిలపడానికి రెడీ అయ్యాడు. డిసెంబర్ 24న ‘రెడ్’ ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారు. రామ్ నటించిన ‘దేవదాస్’ ‘మస్కా’ సినిమాలు ఇంతకముందు పండగ సీజన్ లో వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ‘రెడ్’ ని జనవరి 14న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పటికీ ఇంతవరకు విడుదల తేదీని ప్రకటించలేదు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ త్రిభాషా చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రాన్ని కూడా సంక్రాతి బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే జనవరి 13న ‘మాస్టర్’ తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కానుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ కి ప్రేక్షకుల నుంచి వచ్చే స్పదనను బట్టి సంక్రాంతి రిలీజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కగట్టవచ్చని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మరి ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ – రానా – రామ్ లలో ఎవరు గెలుస్తారో చూడాలి.