ఆర్జీవీ పర్యవేక్షణలో 3 భాగాలుగా ‘ఆర్జీవీ బయోపిక్’…!

0

టాలీవుడ్ లో ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని టార్గెట్ చేస్తూ పలు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందరిపై సెటైరికల్ గా మూవీస్ తీసే వర్మపై రివేంజ్ తీర్చుకోడానికి సినిమాలతో ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం ఆధారంగా ఏకంగా మూడు సినిమాలు రూపొందుతున్నాయి. ఒక్కొక్క సినిమాలో ఆర్జీవీ జీవితంలోని ఆయన వేరు వేరు వయసుల్లో జరిగిన వేరు వేరు అంశాలను చూపించబోతున్నారు. ఈ 3 భాగాలు రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కుతుండటం విశేషం. ఆర్జీవీ జీవితంపై రానున్న ఈ సినిమాలని బొమ్మాకు క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. దొరసాయి తేజ ఈ మూడు పార్ట్స్ కి దర్శకత్వం వహించబోతున్నారు.

కాగా సెప్టెంబర్ లో ఆర్జీవీ రియల్ లైఫ్ స్టోరీపై చిత్రీకరణ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ కి ”రాము – రామ్ గోపాల్ వర్మ ఆరంభం” అనే టైటిల్ పెట్టారు. దీంట్లో వర్మ విజయవాడ కాలేజ్ డేస్.. ఆయన తొలి ప్రేమలు.. గ్యాంగ్ ఫైట్స్ తో మొదలై నాగార్జునతో ‘శివ’ సినిమా చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు.. ఎవర్ని ఎలా మాయ చేసి వాడుకున్నాడన్నది మెయిన్ స్టోరీగా ఉండబోతోంది. పార్ట్ 1 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్ట్ 26న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఇక రెండో భాగాన్ని ”రామ్ గోపాల్ వర్మ – అండర్ వరల్డ్ తో ప్రేమాయణం” అనే టైటిల్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో వర్మ ముంబై జీవితంలో అమ్మాయిలు.. గ్యాంగ్ స్టర్స్ మరియు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో ఆయనకున్న అనుబంధాల గురించి చెప్పబోతోంది. పార్ట్ 3 ”ఆర్.జి.వి – ది ఇంటెలిజెంట్ ఇడియట్” అనే టైటిల్ తో రానుంది. ఇది ఆర్జీవీ వివాదాలు.. దేవుళ్ళ పట్ల శృంగారం పట్ల సమాజం పట్ల ఆయనకి ఉన్న విపరీత వైఖరులతో పాటు.. అతని ఫెయిల్యూర్స్.. ఇతరుల మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపించనున్నారు.

రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం ఆధారంగా తీస్తున్న ఈ భాగాలు పూర్తి స్థాయి సినిమాలని.. ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుందని.. మొత్తం 3 చిత్రాలు కలిపి 6 గంటల సినిమాగా ఆర్జీవీ చరిత్ర ఉండబోతోందని తెలిపారు. అంతేకాకుండా పార్ట్ 1లో 20 ఏళ్ళ ఆర్జీవీ లాగా ఒక కొత్త నటుడు నటిస్తాడని.. పార్ట్ 2 లో వేరే నటుడు.. పార్ట్ 3లో ఆర్జీవీయే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారని మేకర్స్ వెల్లడించారు. రేపు రాబోయే ఫస్ట్ పార్ట్ ఫస్ట్ లుక్ తో ఆర్జీవీ జీవిత చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.