ఆర్జీవీ కొత్త టైటిల్.. “జగమొండి“!?

0

మొదట సంచలన దర్శకుడుగా ఉన్న రామ్గోపాల్ వర్మ.. ఉరఫ్ ఆర్జీవీ.. తర్వాత వివాదాస్పద దర్శకుడిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు సినిమాలు కూడా ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. గత 2019 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను సినిమాగా తీసి రాజకీయాలను వేడెక్కించిన విషయం తెలిసిందే. అంతకు ముందు `వంగవీటి` టైటిల్తో విజయవాడ రాజకీయాలను సైతం తెరకెక్కించి వివాదాలకు కేంద్రంగా మారారు.

ఇక ఆ తర్వాత సెక్స్ సినిమాను తెరకెక్కించారు. ఇక రెండేళ్ల విరామం తర్వాత.. ఇప్పుడు అంతే వివాదాస్ప ద సినిమాను తీస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అది కూడా ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు `జగమొండి` అనే టైటిల్ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనికి నిర్మాతగా .. కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఆర్జీవీతో ఇప్పటికే `డి`-కంపెనీ అనే సినిమా తీస్తున్నాడట. మళ్లీ ఆయనే ఇప్పుడు ఆర్జీవీతో కలిసి మూవీకి రెడీ అయ్యారని అంటున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జగన్ ఎంత మొండి వాడో ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తన పదవి కోసం.. కాంగ్రెస్తో విభేదించడం బయటకు రావడం.. తర్వాత జరిగిన పరిణామాలు.. అనే అంశాలను ఆర్జీవీ చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో జగన్ జైలు జీవితాన్ని కూడా చూపిస్తారని సమాచారం. మొత్తానికి ఆర్జీవీ తీస్తున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.