‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్ రివీల్ చేసిన సచిన్..!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు చిత్ర యూనిట్ నుంచి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటి సమయంలో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సచిన్ ఖేడ్కర్ ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్ ను బయటపెట్టేశాడు.

‘రాధే శ్యామ్’ కథ జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య కొనసాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని సచిన్ కేడ్కర్ మూవీ కన్సెప్ట్ రివీల్ చేసేశారు. ప్రభాస్ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపిస్తారని.. ఆయన పాత్ర ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో తాను ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సచిన్ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ కి సచిన్ చెప్పిన స్టోరీ లైన్ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాగా ఈ చిత్రం తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. జగపతిబాబు – సత్యరాజ్ – భాగ్యశ్రీ – కునాల్ రాయ్ కపూర్ – మురళి శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ‘రాధే శ్యామ్’ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.