పులి కళ్లలో కళ్లు పెట్టి చూడాలని కోడలు సాహసం

0

ఇంతకుముందు ఉపాసన బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ దక్షిణాఫ్రికాలోని వైల్డ్ లైఫ్ ని దగ్గరగా పరిచయం చేసి సర్ ప్రైజ్ చేశారు. పులులు సింహాలు తిరుగాడే చోట ఈ జంట షికార్లు హాట్ టాపిక్ అయ్యాయి. అది సరే కానీ.. ఇప్పుడు అక్కినేని కోడలు సమంత కూడా పులుల్ని క్రూరమృగాల్ని దగ్గరగా లైవ్ లో వీక్షించేందుకు కీకారణ్యంలోకి ప్రవేశించడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ సీజన్ 4 దసరా ప్రత్యేక ఎపిసోడ్ లో సడెన్ గా హోస్ట్ గా కనిపించిన సమంత.. మామ నాగార్జున రోల్ లోకి పరకాయం చేసే ప్రయత్నం చేసింది. అయితే దానికి మిక్స్ డ్ రివ్యూలొచ్చాయి. ఇక డ్యూటీ పూర్తవ్వగానే విహారయాత్రకు వెళ్ళడానికి తన షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకుంది. మహారాష్ట్రలోని అటవీ సంరక్షణ కేంద్రమైన తడోబాలో జంగిల్ సఫారీని ఆస్వాధిస్తున్నట్లు సామ్ స్వయంగా వెల్లడించింది. అడవిలో పులులు ఇతర అడవి జంతువులను దగ్గరగా వీక్షించేందుకు ఆమె అక్కడ తన విలువైన సమయం గడుపుతోంది.

గత కొన్ని వారాలుగా.. సమంత రకరకాల వ్యాపకాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో గచ్చిబౌళి ఇంటి రూఫ్ టాప్ పై వ్యవసాయం చేసి అదరగొట్టిన సామ్.. రూఫ్ టాప్ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన కాయగూరల్ని పండించవచ్చని కూడా సామ్ తెలిపింది. ఆరోగ్యం స్థిరమైన జీవనశైలికి సంబంధించి తన స్నేహితురాలు ఉపాసనతో కలిసి ప్రత్యేకించి యువర్ లైఫ్ డాట్ కాం ని సామ్ రన్ చేస్తోంది. అందులో గెస్ట్ లెక్చర్లు ఇస్తూ ఎంతో విలువైన విజ్ఞానాన్ని షేర్ చేసుకుంటోంది. ఇన్ని వ్యాపకాలు ఉండగా.. ఇటీవలే తన సొంత బట్టల బ్రాండ్ సాకిని ప్రారంభించి ఆశ్చర్యపరిచింది.

కథానాయికగా కెరీర్ సంగతి చూస్తే.. `ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 2 విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇందులో తీవ్రవాది పాత్రలో సామ్ ఊహించని ట్విస్టు ఇస్తుందన్న గుసగుసలు ఇప్పటికే వినిపించాయి. మరోవైపు వరుసగా సినిమాల్లో నటించేందుకు సామ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్ తో ప్రాజెక్ట్ త్వరలోనే కొత్త షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నారు.