బన్ని ఎన్టీఆర్ లా దాచలేక దొరికిపోయిన కింగ్ ఖాన్!

0

ఆన్ లొకేషన్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు స్టార్లు తమ లుక్ ని రివీల్ చేసేందుకు ఎందుకని ఆసక్తి కనబరచరు? ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్ నుంచి తమ లుక్ బయటికి తెలియకుండా దాచేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలానే తంటాలు పడేవారు. పబ్లిక్ లోకి వెళ్లాలన్నా.. విమానాశ్రయాల నుంచి బయటపడాలన్నా ఏదో ఒక విధంగా కవరింగ్ కోసం ట్రై చేసేవారు. ముఖ్యంగా పొడవాటి గిరజాల జుత్తు పెంచితే దానిని కవర్ చేసేందుకు సదరు హీరోలు నానా ఇబ్బందులు పడేవారు. క్యాప్ హ్యాట్ లాంటివి ధరించి కవరింగ్ చేసినా తెలిసిపోయేది. ఇటీవల పుష్ప లుక్ ని దాచేందుకు బన్ని కూడా ఇలానే విమానాశ్రయాల్లో క్యాప్ ధరించాడు. అయినా అతడి మాస్ అవతారం చెదిరిన క్రాఫ్ దొరికిపోయాయి.

ప్రస్తుతం కింగ్ ఖాన్ షారూక్ సైతం ఇలానే చేయాలనుకున్నా వీలుపడడం లేదు. ప్రస్తుతం అతడు పఠాన్ అనే భారీ క్రేజీ చిత్రంలో నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ ఈ మూవీని నిర్మిస్తోంది. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత షారూక్ కంబ్యాక్ కోసం నటిస్తున్న చిత్రమిది. అందువల్ల తన లుక్ సహా ప్రతి విషయంలోనూ ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

కథ ఎంపిక చేసి సంతకం చేసేందుకే రెండేళ్లు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత కష్టపడినా కానీ ఇప్పుడు షారూక్ తన లుక్ ని మాత్రం దాచలేకపోతున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేవరకూ అయినా క్యూరియాసిటీని దాచలేని పరిస్థితి.

తాజాగా ఫఠాన్ నుంచి షారూక్ లుక్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు వెబ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై అంధేరిలోని యష్ రాజ్ ఫిలింస్ స్టూడియోస్ నుంచి బయటికి వస్తూ కెమెరా కంటికి చిక్కాడిలా. పొడవాటి గిరజాల జుత్తుతో వైట్ టీషర్ట్ ధరించి కళ్లజోడుతో సంథింగ్ హాట్ గా కనిపిస్తున్నాడు షారూక్. ఇంతకుముందు డాన్ సినిమాలో పొడవాటి జుత్తుతో కనిపించిన షారూక్ ఈసారి కూడా కొత్తగా ట్రై చేస్తున్నాడు. చూస్తుంటే టార్జాన్ లా జుత్తు పెంచి కనిపిస్తున్నాడు. లుక్ క్యూరియాసిటీ పెంచేస్తోంది.

ఫఠాన్ మూవీలో షారూక్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు? అన్నదానికి సమాధానం ఇదివరకూ రివీలైంది. అతడు ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. టైగర్ జిందా హై తరహాలో భారీ యాక్షన్ కథాంశంతో సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తీవ్రవాదం నేపథ్యం ఉంటుందన్న సమాచారం ఇదివరకూ రివీలైంది.