మెగా హీరో మూవీలో నెగిటివ్ రోల్ లో శివగామి..?

0

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రపథంలో దూసుకుపోయిన సీరియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటికీ అదరగొడుతోంది. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా శివగామిగా పిలవబడుతున్న రమ్యకృష్ణ.. ఇతర దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘హలో’ ‘సూపర్ డీలక్స్’ ‘క్వీన్’ వంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటించింది. బాషాభేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ నటిగా మారిపోయిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

‘ప్రస్థానం’ దేవాకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలోనే తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా రమ్యకృష్ణ ప్రతినాయకి ఛాయలు ఉన్న పాత్ర చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. గతంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహ’ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇప్పుడు తేజ్ సినిమాలో కూడా హీరోకి ధీటుగా నిలబడే పాత్రలోనే కనిపిస్తుందంట. ఇదే కనుక నిజమైతే రమ్యకృష్ణ వంటి సీనియర్ నటికి ధీటుగా సాయి తేజ్ ఎలా నటిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి ”రిపబ్లిక్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అలానే నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు.