‘ఆహా’ ఏమి ప్రమోషనో..

0

తన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలకు తోడు కొన్ని కొత్త సినిమాలేవో అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఏడాది ఆరంభంలో ‘ఆహా’ ఓటీటీని మొదలుపెట్టారు టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్. కంటెంట్ పరిమితం పైగా అది కేవలం తెలుగుకే పరిమితం. నెట్ ఫ్లిక్స్ అమేజాన్ ప్రైమ్ హాట్ స్టార్ లాంటి సంస్థలు వందలు వేలల్లో సినిమాలు వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంచిన నేపథ్యంలో ‘ఆహా’ ఏమాత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది సబ్స్క్రైబర్లను ఆకర్షిస్తుంది అని చాలామంది సందేహించారు. కానీ లాక్ డౌన్ దానికి వరంలా కలిసొచ్చింది. ఓ మోస్తరు కంటెంట్తోనే ఆహా సక్సెస్ అయింది. దాన్ని చక్కగా ప్రమోట్ చేసుకోవడం కూడా కలిసొచ్చింది. ఐతే మధ్యలో కొత్త ఎక్స్క్లూజిక్ కంటెంట్ పెద్దగా లేకపోవడం పేరున్న సినిమాలు లేకపోవడం వల్ల కొంచెం జోరు తగ్గినా ఈ మధ్య మళ్లీ ‘ఆహా’ పుంజుకుంటోంది. కంటెంట్ నెమ్మదిగా పెంచుతున్నారు.

‘ఆహా’ను ప్రమోట్ చేయడానికి అల్లు అరవింద్ తన సర్కిల్ను కూడా బాగానే ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. టాలీవుడ్లో ప్రముఖులందరూ ‘ఆహా’ కంటెంట్ను బాగా ప్రమోట్ చేస్తుండటం ట్విట్టర్ లో గమనించవచ్చు. ఆ ఓటీటీలో ఏ సినిమా రిలీజైనా ట్విట్టర్లో సెలబ్రెటీలు బాగా స్పందిస్తున్నారు. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన చిన్న సినిమా ‘కలర్ ఫోటో’ సంగతే తీసుకుంటే.. ఓ సినిమా యావరేజ్ అన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది కానీ.. ఇండస్ట్రీ జనాలు దీన్ని నెత్తికెత్తుకుని ప్రమోట్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు వేరే వాళ్ల సినిమాల గురించే స్పందించని రవితేజ ‘కలర్ ఫోటో’ గురించి ట్వీట్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. విజయ్ దేవరకొండ అయితే పెద్ద పోస్టే పెట్టాడు దీని గురించి. నాని సైతం ఈ సినిమాకు మాంచి ప్రమోషన్ ఇచ్చాడు.

వీళ్లందరికీ కేవలం సినిమా నచ్చడం వల్లే ప్రమోట్ చేశారని అనుకోలేం. ఒక చిన్న సినిమాకు ఇలా స్వచ్ఛందంగా సపోర్ట్ ఇచ్చేంత పెద్ద మనసైతే ఇండస్ట్రీ జనాలకు ఉందందే సందేహమే. దీని వెనుక ‘అల్లు’ బ్రాండ్ ఉందనే భావించాలి. ‘కలర్ ఫోటో’ అనే కాదు.. ‘ఆహా’లో వస్తున్న రాబోయే కంటెంట్ అంతటికీ ప్రమోషన్ ఓ రేంజిలో ఉంటుందన్నది స్పష్టం. ఈ ఓటీటీకి కంటెంట్ రూపొందించడం కోసం కూడా తక్కువ పారితోషకాలతో చాలామంది ప్రముఖులు పని చేస్తుండటం కూడా గమనార్హం. దీన్ని బట్టి అల్లు అరవింద్ సత్తా ఎలాంటిదన్నది అర్థం చేసుకోవచ్చు.