సుమారు తొమ్మిది నెలల తర్వాత సినిమా రిలీజ్ పోస్టర్స్ పడ్డాయి

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ”సోలో బ్రతుకే సో బెటర్”. సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా రైట్స్ జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ చేయాలా.. డిజిటల్ రిలీజ్ కి వెళ్లాలా అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్.. చివరకు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో ‘సోలో బ్రతుకే..’ చిత్రాన్ని విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కోవిడ్ నేపథ్యంలో ఈ మధ్య సినిమాలన్నీ డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. సుమారు తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ పోస్టర్ విడుదల చేసిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని చెప్పవచ్చు. వచ్చే నెల 25న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఒకవేళ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన వస్తే సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ కోసం క్యూ కట్టే అవకాశం ఉంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే..’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. మోస్ట్ వాంటెడ్ థమన్ సంగీతం అందించాడు. ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజు పండగే’ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత మెగా హీరో నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.