Templates by BIGtheme NET
Home >> Cinema News >> రియల్ హీరో సోనూసూద్ సాయం లెక్క తేలింది…!

రియల్ హీరో సోనూసూద్ సాయం లెక్క తేలింది…!


దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రముఖ నటుడు సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన ఎంతో మందికి సోనూ సూద్ తన వంతు సాయం చేశాడు. విపత్కర పరిస్థితుల్లో కోరిన సాయం చేసి రియల్ హీరోగా అందరి మన్ననలు పొందాడు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసి సొంత ఊళ్లకు చేర్చాడు. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించడం.. పేదలకు అన్ని విధాలుగా సహాయం చేయడం.. ఇలా ఎన్నో సామాజిక సేవలు చేస్తూనే ఉన్నాడు. అయితే సమాజంలో మంచి పని చేసేటప్పుడు మద్దతు తెలిపేవారితో పాటు విమర్శించే వారు కూడా ఉంటారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి చేయూతనందిస్తున్న ఆయనను విమర్శిస్తూ.. ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పు బడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు సోనూ సూద్.

సోనూసూద్ ఓ కథని ఉదాహరణగా చెప్తూ ”మీరేం చేసినా అది నన్ను ప్రభావితం చేయదు. నేను చేయాలనుకున్నది చేస్తాను. నేను ఏమీ చేయలేదని.. నాది మోసం అనే వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇదంతా మీ మెప్పు కోసం చేయట్లేదు. అయినా నేను సాయం చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారి చిరునామాలు ఫోన్ నంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలన్నీ ఉన్నాయి. నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలని కోరుతున్నాను” అంటూ విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

మరోవైపు సోనూసూద్ పీఆర్ టీమ్ కూడా విమర్శకులకు లెక్కలతో సమాధానం చెప్పింది. ఇప్పటి వరకు 703247 మందికి పలు విధాలుగా సహాయం చేసినట్లు వివరణ ఇచ్చింది. ఎవరెవరికి ఎలాంటి సహాయం అందింది అనే విషయాలతో పాటు సహాయం పొందిన వ్యక్తి ఆధార్ వివరాలను కూడా సేకరించినట్లు సోనూసూద్ టీమ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా సోనూ సూద్ సహాయం చేసిన ఖర్చు రెండు నెలల క్రితమే 10 కోట్లకు పైగా అయిందని వార్తలు వచ్చాయి. ఈ మధ్య పేద విద్యార్థుల ఆన్ లైన్ చదువుల కోసం ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ ల్యాప్ టాప్స్ వంటివి కూడా అందించాడు. అలాగే అనేకమంది రైతులకు కూడా సహాయం చేశాడు. ఈ రెండు నెలల కాలంలో మరో 10 నుంచి 15 కోట్ల వరకు అయ్యుంటుందని.. మొత్తంగా 20 -0 25 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సాయం ఇక్కడితో ఆపనని.. నన్ను ట్రోల్ చేసినా సహాయం చేస్తూనే ఉంటానని సోనూసూద్ పేర్కొన్నారు.