Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ గాత్ర నివాళి..!

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ గాత్ర నివాళి..!


నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా.. అప్పుడప్పుడు పాటలు పాడి గొంతు సవరించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తన తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా బాలయ్య గాత్ర నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా బాలయ్య కు చెందిన NBK ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ లో ఈ గీతాన్ని విడుదల చేశారు.

‘వెండితెర మీదున్న కథానాయకుడిని ఆబాల గోపాలనికి ఆరాధ్యున్ని చేసిన ఆది అధినాయకుడు.. తెలుగు ఉనికిని చాటిన జగదభిరాముడు.. తెలుగు జాతి వెన్నుపూస మా నాన్నగారు ఎన్టీఆర్’ అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ శత జయంతి కానుకగా ఈ శ్రీరామ దండకం ఆయనకు అంకితం చేస్తున్నానని బాలయ్య పేర్కొన్నారు. తన తండ్రికి బాలయ్య ఇచ్చిన గాత్ర నీరాజనం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పాడటం ద్వారా బాలకృష్ణ మరోసారి తెలుగు – సంస్కృత పదాల ఉచ్ఛారణలో తనకు సాటిలేరని నిరూపించుకున్నారు. ప్రొఫెషనల్ సింగర్ కానప్పటికీ కఠినమైన పదాలను చాలా సులభంగా పలకడంలో ఆయన విజయవంతమయ్యారు.

అయితే బాలయ్య పొరపాటున ఇది శ్రీరామ దండకం అని చెప్పారని.. కానీ ఇది 12వ శతాబ్దపు కవి వేదాంత దేశిక సంస్కృతంలో రాసిన ‘రఘువీర గద్యం’ అని కామెంట్స్ వస్తున్నాయి. శ్రీరామ దండకం మరియు రఘువీర గద్యం ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయని అంటున్నారు. ఇదిలావుండగా బాలకృష్ణ ఇంతకముందు తన బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ లోని ‘శివ శంకరీ శివానంద లహరి’ ఆలపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే ‘పైసా వసూల్’ చిత్రంలోనూ ఓ మాస్ సాంగ్ పాడి అలరించారు.