నేరుగా యాక్షన్ లోకి ‘పుష్ప’

0

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ లేకుండా కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడే తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. గుబురు గడ్డం మరియు పొడవాటి జుట్టుతో బన్నీ ఇప్పటికే షూటింగ్ కు రెడీగా ఉన్నాడు. కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వస్తున్న మేకర్స్ ఇక టైం వచ్చిందంటూ రంగంలోకి దిగేందుకు సిద్దం అవుతున్నారు.

ఈనెలలోనే పుష్ప సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మొదట షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. బన్నీతో మొదట యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడట. ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఛేజింగ్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారట. ఆ తర్వాత హీరోయిన్ రష్మిక మందన్నా జాయిన్ అవ్వబోతుంది. బన్నీ.. రష్మికల కాంబోలో సీన్స్ ను కూడా కేరళ అడవుల్లోనే చిత్రీకరించే అవకాశం ఉందట.

ఇప్పటికే షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కనుక ఏమాత్రం బ్రేక్ లు లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమాను ముగించేయాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించబోతున్నారట. పుష్ప తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే ఏడాది బన్నీ ద్వితీయార్థంలో కొరటాల శివ మూవీలో నటించబోతున్నాడు.