రెండు న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన డి. సురేష్ బాబు…!

0

ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తారనే విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలను ఎంచుకోవడమే కాకుండా వాటి మార్కెట్ ని కూడా అంచనా వేయడంలో సురేష్ బాబు తలపండిన వారని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘నారప్ప’ సినిమా తీస్తున్న సురేష్ బాబు మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. రామానాయుడు ఫిలిం స్కూల్ పూర్వ విద్యార్థులతో రెండు సరికొత్త చిత్రాలు నిర్మించనున్నట్లు సురేష్ బాబు ప్రకటించారు.

కాగా రామానాయుడు ఫిల్మ్ స్కూల్ విద్యార్థులైన సతీష్ త్రిపుర మరియు అశ్విన్ గంగరాజు అనే ఇద్దరు దర్శకులతో.. ఒక ఉత్కంఠ భరితమైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మరియు ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లను సురేష్ బాబు నిర్మించనున్నారు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలు రాయిగా అభివర్ణించవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాలలో నటించే నటీనటులు టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘మా ఫిలిం స్కూల్ విద్యార్థులను కొన్నేళ్లుగా సినీరంగంలో వచ్చే మార్పులకు సవాళ్లకు టెక్నాలజీకి మరియు పోటీకి తగ్గట్టుగా మలచటంలో మేము సక్సెస్ అయ్యాము” అని తెలిపారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు డిజిటల్ రంగం రాకతో ఫిల్మ్ మేకింగ్ లో సరికొత్త మార్పులు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే రామానాయుడు ఫిలిం స్కూల్ విద్యార్ధులు తమ ప్రత్యేకతను చాటుకునేలా తయారు చేస్తున్నాము” అని రానా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దగ్గుబాటి రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాని సమర్పిస్తున్న సురేష్ బాబు.. గుణశేఖర్ – రానా కాంబినేషన్ లో ‘హిరణ్యకశ్యప’ అనే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.