దశమి స్పెషల్: ఇచ్చట వాహనములు నిలపరాదు!

0

విజయదశమి శుభాకాంక్షలతో టాలీవుడ్ టాప్ 20 సినిమాల కొత్త లుక్ లు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బ్యానర్లు దసరా శుభాకాంక్షలతో ప్రచారం హోరెత్తించాయి. కొన్ని టీజర్లు రిలీజై ఆకట్టుకున్నాయి. ఇక అల వైకుంఠపురములో తరవాత సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడినా ఇటీవల చిత్రీకరణను సాగిస్తున్నారన్న సమాచారం ఉంది.

`చిలసౌ` సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన సుశాంత్ ఈసారి కూడా మరో బంపర్ హిట్ కొట్టాలన్న పంతంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఎస్ దర్శన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పోస్టర్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పాటు టైటిల్ తో ఉన్న సైన్ బోర్డ్ను ఇంతకుముందు రివీల్ చేశారు.

తాజాగా విజయదశమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై సుశాంత్ తన లేడీ లవ్ తో కనిపించాడు. అప్పుడే అమ్మవారికి పూజా కార్యక్రమం వాహన పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని జంటగా బయల్దేరేందుకు సిద్ధమవుతున్నారు ఆ ఇద్దరూ.

ఇక ఈ సినిమా ఏఐ స్టూడియోస్- శాస్త్రా మూవీ బ్యానర్లపై రవి శంకర్ శాస్త్రి- హరీష్ కోయలగుండ్లలు నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. వెన్నెల కిశోర్- ప్రియదర్శి- అభినవ్ గోమటం- ఐశ్వర్య- నిఖిల్ కైలాస- కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్ర ల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి లాంటి అందగత్తె కథానాయికగా పరిచయం అవుతోంది.