Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘కేజీఎఫ్ 2’ టీజర్ వచ్చేసింది..

‘కేజీఎఫ్ 2’ టీజర్ వచ్చేసింది..


‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైన దక్షిణాది చిత్రం ”కేజీఎఫ్”. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ‘కేజీఎఫ్ 2’ ని ఎక్కడా రాజీ పడకుండా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘కేజీఎఫ్ 2’ నుంచి హీరో యష్ బర్త్ డే సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్ టైమ్స్’ అంటూ రోజుకో వాల్యూమ్ ని రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచేశారు. అయితే ఆల్రెడీ టీజర్ లీక్ అవడంతో కాస్త ముందుగానే అంటే ఈరోజు రాత్రి 9.29 గంటలకు ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే రాకీభాయ్ ని ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ టీజర్ లో చూపించారు. కోలార్ గోల్డ్ మైన్స్ ఆధిపత్యం కోసం రాకీ భాయ్ ప్రత్యర్ధులతో ఎలా పోరాడాడు అనేది చూపిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ”పవర్ పుల్ పీపుల్ పవర్ ఫుల్ ప్లేషెస్ నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది” అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ గూస్ బమ్స్ కలిగిస్తోంది. టీజర్ చివర్లో రాకీభాయ్ గా యష్ ఓ మెషిన్ గన్ పట్టుకొని కాల్చే సీన్ అద్భుతంగా ఉంది. కాలుతున్న మెషిన్ గన్ కి సిగరెట్ ముట్టించుకుంటూ యష్ కోపంగా చూడటంతో టీజర్ పూర్తయింది. మొదటి చాప్టర్ ని మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయని అర్థం అవుతోంది.

ఈ టీజర్ కి రవి బాస్రుర్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ అధీరా పాత్రలో క్రూరంగా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ – రావు రమేష్ – ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ లో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు ‘కేజీఎఫ్ 2’ లో సమాధానం లభించనుంది. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రం కన్నడ తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం వారు రిలీజ్ చేస్తున్నారు.