సుశాంత్ ఇంటి తాళం పగలకొట్టిన వ్యక్తి వెల్లడించిన విషయాలు…!

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ బృందం ముంబైలోని బాంద్రా పోలీసులతో సమావేశమై కేసు డైరీ.. సుశాంత్ కి సంబంధించిన ఫోన్లు.. కొన్ని ఫైళ్లను స్వాధీనపరుచుకొన్నారని సమాచారం. అయితే రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు బయటకి వస్తున్నప్పటికీ ఈ కేసు విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈ కేసుపై జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ తో తాళాలు చేసే వ్యక్తి(కీ మేకర్) చెప్పిన విషయాలు పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

కీ మేకర్ మాట్లాడుతూ.. ‘జూన్ 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. గదికి వేసిన తాళం పగలకొట్టాలని నాకు చెప్పారు. తాళం ఫోటోను వాట్సాప్ చేయమని నేను కోరాను. ఆ తాళం ఫోటోను నాకు వాట్సప్ లో పంపారు. ఆ తర్వాత నేను సుశాంత్ ఉండే అపార్ట్మెంట్ ఆరో అంతస్తుకు వెళ్లాను” అని చెప్పాడు. ”అక్కడికి వెళ్లిన తర్వాత అందరూ ఆందోళనకు గురవుతూ నాకు తాళం పగలకొట్టమని చెప్పారు. అయితే తాళం పగలకొట్టే సమయంలో ఒకవేళ ఆ గది నుంచి ఏదైనా శబ్ధం వస్తే తాళం పగలగొట్టే పని ఆపేయాలని వాళ్ళు కంగారుగా చెప్పారు. వారు కంగారు పడటం చూసి నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ గదికి వేసిన తాళాన్ని నేను సుత్తితో పగలకొట్టాను. దానికి నాకు రూ. 2 వేలు ఇచ్చారు. తాళం పగలకొట్టిన తర్వాత నన్ను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. సుశాంత్ గదిలోకి నన్ను వెళ్లనివ్వలేదు” అని చెప్పుకొచ్చాడు. ఇంకా అతను మాట్లాడుతూ.. ‘ముంబై పోలీసులు పిలిస్తే వెళ్లి నాకు తెలిసి చెప్పాను. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు గురించి తెలిసింది. నాకు అధికారుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. ఒకవేళ సీబీఐ అధికారులు కాల్ చేస్తే వారికి నాకు తెలిసింది చెప్తాను’ అని తాళాలు రిపేర్ చేసే వ్యక్తి వెల్లడించారు.