లైంగిక వేదింపులకు కారణం మహిళలే అంటున్న సూపర్ హీరో

0

బాలీవుడ్ నటుడు..శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా మీటూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళ సంఘాల వారి ఆగ్రహంను చవి చూశాడు. గతంలో కూడా పలు సార్లు ఆడవారిని తక్కువ చేసి మాట్లాడటం తన తోటి నటీనటులను అవహేళనగా మాట్లాడటం ఈయనకు అలవాటు. ఆ అలవాటుతోనే ఈసారి ఆడవారు లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా చేస్తున్న మీటూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలు అయ్యాడు. ఆడవారు ఇంటి పట్టున ఉండి ఇంటి పని చేసుకుంటే మీటూ ఉద్యమం మొదలు అయ్యేదా అంటూ ప్రశ్నించాడు.

తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీటూ ఉద్యమానికి పూర్తి బాధ్యత వహించాల్సింది మహిళలే. వారు ఇళ్లు దాటి మగాళ్ల బుజాలు రాసుకుంటూ పని చేయడం ప్రారంభించారు. అప్పటి నుండే లైంగిక వేదింపులు మొదలు అయ్యాయి. ఆడవారు అంటే ఇంటి పట్టున ఉండి కుటుంబ బాధ్యత చూసుకోవాలి. అలా కాదని బయటకు వచ్చి ఇప్పుడు మీటూ అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడం ఏంటీ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను నెటిజన్స్ మరియు మహిళ సంఘాల వారు తప్పుబట్టడమే కాకుండా మహిళలోకంకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మీటూ వల్ల ఎంతో మంది మహిళలు ధైర్యంగా ఉంటున్నారు. గతంలో మాదిరిగా లైంగిక వేదింపులు లేవు. అలాంటి మీటూ ఉద్యమంను కించపర్చడం ఆయనకు భావ్యం కాదని సినీవర్గాల వారు కూడా అంటున్నారు.