రాజశేఖర్ ఆరోగ్యంపై కుమార్తె ఎమోషనల్ ట్వీట్

0

హీరో రాజశేఖర్ కోవిడ్ 19 నుంచి కోలుకుంటున్నారన్న శుభవార్తతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఓవైపు ఆస్పత్రి వర్గాలు మరోవైపు కుటుంబ సభ్యులు ఈ మంచి వార్తను చెప్పడంతో అంతా ఆనందంగా ఉన్నారు. తాజా ట్వీట్ లో నాన్న గారు పూర్తిగా కోలుకుంటున్నారని ఆయన చిన్న కుమార్తె శివత్మిక రాజశేఖర్ తెలిపారు. చికిత్స చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

నిజానికి ఆస్పత్రిలో చేరేప్పటికి రాజశేఖర్ శ్వాస సంబంధ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటూ ఇబ్బందికరంగానే ఉన్నారు. తాజా హెల్త్ బులెటిన్ నివేదిక ప్రకారం.. అధిక ప్రవాహ ఆక్సిజన్ చికిత్సతో రాజశేఖర్ కోలుకుంటున్నారని వెల్లడైంది. దీంతో శివత్మిక రాజశేఖర్ ట్వీట్ చేస్తూ.. “నాన్న కోలుకుంటున్నారు! డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారి నేతృత్వంలోని సిటిన్యూరోలో వైద్యుల బృందానికి కృతజ్ఞతలు. మా కోసం ఎల్లప్పుడూ అక్కడ ఉన్నందుకు ప్రియమైన డాక్టర్ మధు గారికి ధన్యవాదాలు! మీ ప్రార్థనలు శుభాకాంక్షలే చాలా ఎక్కువ! మీ ఆలోచనలే మా బలం” అంటూ ఎమోషన్ కి గురయ్యారు.

రాజశేఖర్ కుటుంబం అక్టోబర్ మొదటి వారంలో ఆసుపత్రిలో చేరగా.. ఆయన భార్య జీవిత.. కుమార్తెలు కరోనావైరస్ నుండి వేగంగా కోలుకున్నారు. కానీ రాజశేఖర్ పరిస్థితి గత వారం క్షీణించింది. తాజాగా శివాత్మిక ట్వీట్ తో ఆయన కోలుకుంటున్నారని అర్థమవుతోంది.