‘కొండ పొలం’ టైటిల్ తో రాబోతున్న మెగా హీరో..?

0

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి – జాగర్లమూడి సాయిబాబా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపి 45 రోజుల్లో పూర్తి చేశారు. పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేసే క్రిష్ ఈ చిత్రాన్ని ఎలాంటి హడావిడి లేకుండా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరణ జరిపారు.

కాగా ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో ఇంతకముందు వచ్చిన ‘గమ్యం’ సినిమా తరహాలోనే రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ”కొండ పొలం” అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెడుతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఒక ప్రముఖ నవల ఆధారంగా రూపొందితోందని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.