సంక్రాంతి బరిలో నిలవనున్న పవర్ స్టార్..!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”వకీల్ సాబ్”. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది హిందీ సూపర్ హిట్ ‘పింక్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ లేకపోయుంటే వేసవిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేవారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలుపుతారని అందరూ అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని వార్తలు రావడంతో వకీల్ సాబ్ సంక్రాంతికి రావడం కష్టమే అని ఫిక్స్ అయ్యారు.

అయితే ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. అంతేకాకుండా నిన్న పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టేసాడు. దీంతో సంక్రాంతి రేసులో ‘వకీల్ సాబ్’ ఉందని అర్థం అవుతోంది. ‘వకీల్ సాబ్’ లో పవన్ తనకు సంబంధించిన షూటింగ్ కేవలం పది రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. మిగతా షూటింగ్ కూడా డిసెంబర్ మూడో వారానికి పూర్తయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందని సమాచారం. దీనిని బట్టి చూస్తే ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే కనుక నిజమైతే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పవన్ మేనియా చూడొచ్చు. ఇప్పటి వరకు నితిన్ ‘రంగ్ దే’.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. రవితేజ ‘క్రాక్’.. రానా ‘అరణ్య’.. రామ్ ‘రెడ్’ సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించారు.

కాగా పవన్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే తెలుగులో ఈ సినిమాలో చాలా మార్పులు చేసారని తెలుస్తోంది. ఈ మూవీలో యాక్షన్ కూడా ఉందని మోషన్ పోస్టర్ ద్వారా హింట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రంలో శృతి హాసన్ – అంజలి – నివేదా థామస్ – అనన్య – ప్రకాష్ రాజ్ – నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.