వకీల్ సాబ్ .. భారీ సెట్లో మొత్తం పూర్తి చేస్తారట!

0

పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్` కి ఆరంభం నుంచి ఏవో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారీ మహాశాపమైంది. పవన్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు అంగీకరిస్తూ స్పీడ్ పెంచాలని ప్లాన్ చేస్తుంటే ఊహించని విధంగా మహమ్మారీ దారుణమైన దెబ్బ కొట్టింది. కేవలం మహమ్మారీ కారణంగా దిల్ రాజుకు అనూహ్యంగా బడ్జెట్ పెరిగిందని గుసగుసలు వినిపించాయి.

అప్పుడు కరోనా అడ్డంకి అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో షూటింగ్ ని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్షాల కారణంగా షూటింగుని నవంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నారని ఇటీవల ప్రచారమైంది. అక్టోబర్ 24 లేదా 25 న షూటింగుని తిరిగి ప్రారంభించబోతున్నారని భావించినా ఈ ఆలస్యం తప్పడం లేదు.

అలాగే నవంబర్ నుంచి చిత్రీకరణలో పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారా లేదా? అన్న చర్చ కూడా సాగుతోంది. కొందరు జనవరి నుంచే పవన్ సెట్స్ కి జాయిన్ అవుతారని కూడా చెబుతున్నారు. వకీల్ సాబ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ భారీ కోర్టు సెట్ వేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాదాపు ఇది పూర్తయిందిట. రాబోవు షెడ్యుల్ లోని మిగిలిన షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే షూట్ చేస్తారని తాజాగా వెల్లడైంది. వేణు శ్రీరామ్ ఈ సినిమా షెడ్యూల్ ని పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారట. శరవేగంగా పూర్తి చేసి వచ్చే జనవరి లేదా సమ్మర్ నాటికి ఈ మూవీని రెడీ చేస్తారా లేదా? అన్నది చూడాలి.