సేతుపతితో నిత్యానా.. ఇరగదీసేయడం గ్యారెంటీ

0

కోలీవుడ్ టాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఆయన కోసం దర్శకనిర్మాతలంతా పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు పరిశ్రమల్లో ఇంత బిజీగా ఉన్న సేతుపతి మరోవైపు హిందీ చిత్రసీమతో పాటు ఇటు మలయాళం వైపు చూస్తుండడం హీటెక్కిస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఊపిరిసలపనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న 800 లో నటిస్తున్నానని ప్రకటించారు.

ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే.. విజయ్ సేతుపతి మలయాళంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రానికి సంతకం చేశారు. అన్ని దక్షిణాది భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో సేతుపతి సరసన ట్యాలెంఎడ్ నటి నిత్యా మీనన్ నటించనున్నట్లు సమాచారం. అంటే సేతుపతి వర్సెస్ నిత్యా ఎపిసోడ్స్ లో ఇరగదీసేయడం గ్యారెంటీ అన్నమాట.

ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ `బ్రీత్`లో అభిషేక్ బచ్చన్ తో పాటు నిత్య కూడా కనిపించింది. అంతకుముందు అక్షయ్ కుమార్ తో కలిసి మిషన్ మంగళ్ వంటి క్రేజీ ప్రాజెక్టులో నటించి మెప్పించింది. ఇక తాజా మాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరోవైపు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెనలో సేతుపతి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందని ప్రచారమవుతోంది. దీంతో పాటే బన్ని .. ఎన్టీఆర్.. చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో విలనీ చేసేందుకు సేతుపతి ఆసక్తిగా ఉన్నాడని ప్రచారమవుతోంది. బన్ని-సుక్కు సినిమాలోనూ సేతుపతి కీలక పాత్రను పోషించనున్నారు.