మళ్లీ విజయ్ తో కలిసి నటిస్తున్న రష్మిక…?

0

టాలీవుడ్ లోకి ‘ఛలో’ చిత్రంతో మెరుపులా వచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ్ లో ‘సుల్తాన్’.. కన్నడలో ‘పొగరు’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోందీ లక్కీ బ్యూటీ. అయితే ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని సమాచారం.

కాగా విజయ్ దేవరకొండ – రష్మిక కలిసి ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. ఒకటి మంచి విజయాన్ని సాధించగా మరొకటి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడిచిందని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లపై ఇద్దరూ ఎప్పుడు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ జోడీ మరోసారి కలిసి నటించబోతున్నారట. కాకపోతే ఈసారి సినిమాలో కాకుండా ఓ యాడ్ కోసం కలుస్తున్నారట. ఒక దుస్తుల బ్రాండ్ యాడ్ కోసం విజయ్ తో కలిసి రష్మిక నటిస్తోందట. అయితే ఈ బ్రాండ్ కి ఈ బ్యూటీని విజయ దేవరకొండనే సిఫార్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.