నాగ చైతన్య ఈ 11 ఏళ్లలో సాధించిందేమిటి?

0

2009లో అక్కినేని మనవడు.. కింగ్ నాగార్జున వారసుడు నాగ చైతన్య `జోష్` అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. వాసువర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేటి నాయిక రాధ కుమార్తె కార్తీక నాయర్ కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజై 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ చిరస్మరణీయ దినాన్ని అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని చైతే సతీమణి స్టార్ హీరోయిన్ సమంత కూడా మర్చిపోలేదు. తన ట్విట్టర్ లో చైతన్య జోష్ కి సంబంధించిన స్పెషల్ ఫోటోని షేర్ చేసిన సామ్ ఆసక్తికర వ్యాఖ్యానాన్ని జోడించారు. “రాబోయే దాని కోసం చాలా సంతోషిస్తున్నాం. నా హీరో ప్రకాశవంతంగా వెలుగొందుతాడు” అంటూ సామ్ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు.

ఇక చైతన్య నటించిన రెండవ చిత్రం `ఏ మాయ చేసావే`తోనే సామ్ టాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆరంభమే లవ్ లో పడ్డారు. ఎనిమిదేళ్లకు ఆ లవ్ ఫలించి పెద్దల్ని ఒప్పించి పెళ్లాడేసారు. అదంతా సరే కానీ.. ఈ 11 ఏళ్ల కెరీర్ జర్నీలో చైతన్య ఏం సాధించాడు? అంటే… అతడు కెరీర్ పరంగా ఇంత సుదీర్ఘ అనుభవం వచ్చాకే సెటిలయ్యాడని చెప్పాలి. నటుడిగా మెరుగులు దిద్దుకుని బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ ఫార్ములాని దొరకబుచ్చుకున్నాడు అతడు. కెరీర్ మధ్యలో కొన్ని ప్రయోగాలు ఫెయిలైనా కానీ.. ఇప్పటికి స్థిమితపడ్డాడనే చెప్పాలి.

అయితే నాగార్జున అంత స్టార్ డమ్ ని అందిపుచ్చుకోవాలంటే చైతన్య చాలా గొప్ప ఎత్తుగడలు వేస్తూ ముందుకెళ్లాలి. అదేమీ అంత ఆషామాషీ కాదు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో. అతడు తనని తాను అసాధారణ స్టార్ డమ్ ఉన్న స్టార్ గా ఆవిష్కరించుకోవడానికి అతడు నాగార్జున తరహాలోనే ఎప్పటికప్పుడు విలక్షణతను ఆపాదించుకుని ప్రయోగాలతో మిరాకిల్స్ చేస్తేనే సాధ్యం. లుక్ పరంగా ఎంచుకునే కంటెంట్ పరంగా వైవిధ్యం అతడిని గొప్ప స్టార్ గా ఆవిష్కరిస్తుందేమో!