ఈ భామను చూశాక.. అర్జెంట్ గా అరటిపండు డైట్ ఏమిటో తెలుసుకోవాల్సిందే

0

సన్నజాజి మొగ్గలా ఉండటం..అవసరం లేని కండ చెంచాడు కూడా లేకపోవటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. ఒకప్పుడు బొండు మల్లెలా ఉన్న అమ్మడు.. ఇప్పుడు తన వయసును సగానికి తగ్గించేసుకున్నట్లుగా కనిపించటం చూస్తే.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏమిటో అర్జెంట్ గా తెలుసుకోవాలనిపించక మానదు. ఇంతకూ ఈ భామ పేరేమిటి? ఆమె కథేమిటి? అంటారా? అక్కడికే వస్తున్నాం.

ఆమె పేరు లియాన్నె ర్యాట్ క్లిఫ్. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె క్వీన్ లాండ్ లో పుట్టింది. తాజాగా నలభయ్యో పుట్టిన రోజును జరుపుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్లు భారీగా ఉంటారు.ఒకప్పుడు ఈ బొద్దు భామను ఇప్పుడైతే మాత్రం.. బనానా బ్యూటీ అనేస్తారు. నలభై ఏళ్ల ఈ భామను చూసేందుకు పాతికేళ్లు కూడా ఉండవన్నట్లుగా ఉంటుంది. అలాంటి ఆమె పదిహేనేళ్ల క్రితం అందరిలానే కాస్తంత కండ పట్టి.. బొద్దుగా.. పుష్టిగా ఉండేది. కనీసం వారంలో మూడుసార్లు నాన్ వెజ్ తినకుండా ఉండలేని పరిస్థితి. అలాంటి ఆమె ఒక్కసారి తనను తాను మార్చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. అంతే.. ఆమె రోజువారీ ఆహారాన్ని పూర్తిగా మార్చేసింది. దాంతో ఈ అమ్మడు శిల్పి చెక్కిన శిల్పంలా మారిపోయింది.

ఇంతలా మారిపోవటానికి ఆమె ఏం చేసింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందన్న విషయానికి వస్తే.. చాలా సింఫుల్ అని చెబుతారు. వండిన ఆహారం కాకుండా.. పండ్లు.. పచ్చి కాయగూరల్ని తినటమే తన బ్యూటీ సీక్రెట్ గా ఆమె చెబుతున్నారు. పద్నాలుగేళ్లుగా ఇలాంటి ఫుడ్ తింటున్న ఆమె.. ఇప్పటివరకు 18 కేజీలు తగ్గటమే కాదు.. ఆరోగ్యంగా ఉన్నారు.

ప్రతి రోజు ఉదయం సగం పుచ్చకాయ తినే ఆమె.. మధ్యాహ్నం లంచ్ కింద నాలుగు అరటిపండ్లు ముక్కలు.. ఒక బొప్పాయి.. రెండు టర్కీ పండ్ల ముక్కల్ని తినేస్తుంది. ఇంట్లో తయారు చేస్తున్న ఐస్ క్రీంలో ఈ పండ్లను కలుపుతుంది. రాత్రి అయ్యేసరికి వివిధ కూరగాయ ముక్కల్ని కొబ్బరి చట్నీతో కలిపి తింటుందట. మొత్తంగా ఆమె రోజు మొత్తం తినే ఆహారం.. కేవలం 2700 కేలరీలు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

అరటి పండులా పై నుంచి కింద వరకు ఒకేలా ఉండే.. ఈమెను చూసినోళ్లంతా బనానా గర్ల్ అంటూ పిలవటం షురూ చేశారు. ఇక.. మారిన డైట్ గురించి ఆమె అనర్గళంగా చెప్పేస్తారు. ఒకప్పుడు నాన్ వెజ్ ను భారీగా లాగించేసిన ఆమె.. ఇప్పుడు ప్యూర్ వెజ్ గా మారటమే కాదు.. ఆహారం విషయంలో చాలామంది హర్ట్ అయ్యేలా మాట్లాడతారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తనను తాను మేకోవర్ చేసుకున్న తీరుకు మాత్రం ఫిదా కావాల్సిందే.