ఓటీటీ అనగానే యంగ్ హీరో లైట్ తీస్కున్నాడా?

0

మహమ్మారీ రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడే కెరీర్ బండిని సాఫీగా సాగిస్తున్న యంగ్ హీరోలకు ఇది చావు కబురులా మారింది. నాలుగైదు నెలలుగా అసలు ఊపిరాడనివ్వడం లేదు. ఇంకో ఆర్నెళ్లు వ్యాక్సినో టీకానో రాకపోతే ఇదే పరిస్థితి. ఇలాంటి టైమ్ లో గొప్ప గొప్ప కలలు కంటూ ఆశగా సినిమాలు చేసి థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూసిన చాలా మంది ప్రతిభావంతులైన యువ హీరోలు దర్శకులు ఆశల్ని చంపేసుకుని ఓటీటీకి ఓకే చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది.

ఇప్పుడు అదే బాటలో ఓ యంగ్ హీరో సినిమాని కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తుంటే అతడు మాత్రం స్పందించలేదట. నిర్మాతల మెసేజ్ కి రిప్లయ్ ఇవ్వడం లేదట. ఇంతకీ ఎవరా యంగ్ హీరో అంటే.. ఆర్.ఎక్స్ 100 కార్తికేయ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సైలెంటుగా దూసుకొచ్చిన ఈ ట్యాలెంటెడ్ హీరో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కేందుకు చాలానే శ్రమిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మహమ్మారీ వెన్నుపోటు పొడిచింది. పెద్ద తెర ఆశలతో ఉంటే ఓటీటీ ఇలా డౌట్ పెట్టేసింది మరి.

కార్తీకేయ నటిస్తున్న తాజా చిత్రం `చావు కబరు చల్లగా` ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా పదిహేను రోజులు షూట్ మిగిలి ఉంది. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశం ఇప్పట్లో లేదు కాబట్టి.. ఆహా యాప్ కి ఇచ్చేడానికి ఈ మూవీ నిర్మాత బన్ని వాసు ప్లాన్ చేస్తున్నారట. అయితే కార్తీకేయ ఏమంటాడో అని వెయిటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆహా యాప్ వాళ్లు తీసే ఓటీటీ కంటెంట్ లో కూడా కార్తీకేయను నటింపజేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికి కార్తికేయ నుంచి రిప్లై రావాల్సి ఉందని తెలిసింది. ఆర్.ఎక్స్ 100 తరహాలో సొంత సినిమా చేసినా.. 90 ఎమ్.ఎల్ తో ఫ్లాప్ ఎదురైంది. అందుకే ఇప్పుడు కార్తికేయ ఆలోచన ఎలా ఉంది? అన్నది ఇంపార్టెంట్. పెద్ద తెర ఓటీటీ అనే తేడా చెరిగిపోతోంది కాబట్టి అతడు ఓకే చెబుతాడా? లేక కాదనేస్తాడా? అన్నది చూడాలి.

ఇక కార్తికేయ లాంటి యంగ్ హీరోల్ని ఎంకరేజ్ చేసేందుకు జీఏ2 బ్యానర్ సహా అన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయి. అయితే కాస్త పట్టు విడుపు ఉంటే ఓటీటీ సినిమాలతోనూ హవా సాగించే వీలుంటుందని భావిస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్లు సైతం ఓటీటీలో నటించేందుకు ఆసక్తి చూపుతున్న వేళ మన టాలీవుడ్ యంగ్ హీరోల మైండ్ సెట్ మారుతుందేమో చూడాలి.