8 పేజీల డైలాగ్స్ ను ఒక్క టేక్ లో చెప్పేసిన యంగ్ హీరో!

0

కార్తికేయ కథానాయకుడిగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందిన ‘చావుకబురు చల్లగా’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించిన విశేషాలను దర్శకుడు కౌశిక్ ప్రస్తావించాడు. “మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. ఇంటర్ చదువుతుండగానే నేను సినిమా డైరెక్టర్ ను కావాలని ఫిక్స్ అయ్యాను. బీటెక్ చదువుతూనే కథలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను.

ఈ కథ వినగానే బన్నీ వాసుగారు ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. నిజానికి ఇంత పేరున్న బ్యానర్లో నా మొదటి సినిమాను చేస్తానని నేను ఎంతమాత్రం ఊహించలేదు. హీరో కార్తికేయ అయితే ఈ పాత్రకి కరెక్టుగా సరిపోతాడని భావించి ఆయనను ఎంపిక చేసుకున్నాము. మా నిర్ణయం సరైనదే .. ఈ పాత్రకి ఆయన సరిగ్గా సరిపోయాడని అంతా అంటున్నారు. ఆయనకు చాలా జ్ఞాపకశక్తి ఎక్కువ. షూటింగు పూర్తయ్యేవరకూ ఆయన సీన్ పేపర్ తీసుకుని డైలాగ్స్ ప్రిపేర్ అయింది లేదు. నేను చెప్పిన డైలాగ్స్ గుర్తుపెట్టుకుని వెంటనే చెప్పేసేవాడు.

ఎంత పెద్ద డైలాగ్ అయినా .. ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా గుర్తుపెట్టుకుని చెప్పేయడం ఆయన ప్రత్యేకత. ఈ సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించేటప్పుడు మాకు ఉన్నది కేవలం అరగంట సమయమే. ఆ తరువాత లొకేషన్ పర్మిషన్ లేదు .. ఆర్టిస్టుల డేట్లు లేవు. అరగంటలో పేకప్ చెప్పేయాలి .. ఆ సీన్లో కార్తికేయ 8 పేజీల డైలాగ్స్ చెప్పాలి. కార్తికేయ దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పాను. నువ్వు ఏది చేస్తే అదే క్లైమాక్స్ .. మరో మార్గం లేదు అని అన్నాను. 8 పేజీల డైలాగ్స్ ను కూడా ఆయన సింగిల్ టేక్ లో చెప్పేశాడు. సెట్లో ఉన్నవాళ్లు క్లాప్స్ కొట్టారు .. థియేటర్లలో ఆ సీన్ కి విజిల్స్ పడుతున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు.