Templates by BIGtheme NET
Home >> GADGETS >> Samsung Galaxy A51ను లాంచ్ చేసిన శాంసంగ్.. Poco X2కు గట్టిపోటీ తప్పేలా లేదు మరి!

Samsung Galaxy A51ను లాంచ్ చేసిన శాంసంగ్.. Poco X2కు గట్టిపోటీ తప్పేలా లేదు మరి!


టెక్నాలజీ ప్రియులందరూ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ను దాదాపు అవే ఫీచర్లతో ఎటువంటి మార్పులూ లేకుండా మన దేశంలో కూడా అందించనున్నారు. కాకపోతే ధర విషయంలో మాత్రం వియత్నాంలో నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకే ఇండియాలో ఈ ఫోన్ ను విక్రయించనున్నారు. ఇప్పటి దాకా వచ్చిన రూమర్లను బట్టి చూస్తే పోకో ఎక్స్2 కూడా ఇదే ధరలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. కాబట్టి మార్కెట్లోకి రాకముందే పోకో ఎక్స్2కు ఇది గట్టిపోటీలా మారింది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేక ఫీచర్లేంటి? అనే వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం!

​​ధర ఎంత?

శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.23,999గా నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించారు. వియత్నాం కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అక్కడ దీని ధరలను 7.9 మిలియన్ వియత్నాం డాంగ్ లుగా(సుమారు రూ.24,500) నిర్ణయించారు. ఈ ఫోన్ కు సంబంధించిన సేల్ జనవరి 31 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 27 నుంచి వియత్నాంలో అందుబాటులో ఉండనుంది. బ్లాక్ ప్రిజం క్రష్, వైట్, బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

​లాంచ్ ఆఫర్లు ఇవే!

ఈ ఫోన్ పై లాంచ్ ఆఫర్లను కూడా శాంసంగ్ అందించింది. అమెజాన్ పే ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. అంతేకాకుండా శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి వన్ టైమ్ ఫ్రీ రీప్లేస్ మెంట్ లభించనుంది.

​ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే!

శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీగా ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

​కెమెరాలు అదుర్స్!

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు L ఆకారంలో ఉన్న సెటప్ లో నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో ఉంది. 5 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

​మిగతా ఫీచర్లు ఇవే!

ఇక ఇందులో ఉన్న మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. 4జీ ఎల్ టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, బారో మీటర్, గైరో సెన్సార్, జియో మాగ్నటిక్ సెన్సార్, హాల్ సెన్సార్, ఆర్ జీబీ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు.