Templates by BIGtheme NET
Home >> GADGETS >> ఈ ఫోన్లు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం.. 2020లో భారీ తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే!

ఈ ఫోన్లు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం.. 2020లో భారీ తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే!


టెక్నాలజీ పరంగా 2020 ప్రారంభం కావడమే ఎంతో ఘనంగా మొదలైంది. శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లన్నీ తమ తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. అలాగే తమ కంపెనీలకు చెందిన పాత ఫోన్లపై భారీగా ధర తగ్గింపును కూడా అందించాయి. ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ నుంచి మిడ్ రేంజ్ ఫోన్ అయిన వివో జెడ్1 ప్రో వరకు ఎన్నో స్మార్ట్ ఫోన్లు ఇందులో ఉన్నాయి. కాబట్టి మీరు కొనాలనుకునే స్మార్ట్ ఫోన్ ఈ జాబితాలో ఉందేమో చూడండి! ఒకవేళ ఉంటే దాన్ని కొనడానికి ఇంతకంటే సరైన సమయం ఇంకోటి లేనట్లే!

​1. శాంసంగ్ గెలాక్సీ ఎస్10(రూ.16,100 తగ్గింపు)

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 స్మార్ట్ ఫోన్ పై కొత్త సంవత్సరంలో రూ.16 వేల తగ్గింపు లభించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.54,900గా ఉంది. ఈ ఫోన్ లో 6.1 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) స్క్రీన్ ను అందించారు. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరాల సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది.

​2. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్(రూ.17,100 తగ్గింపు)

పైన పేర్కొన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్10కు ప్లస్ వెర్షన్ అయిన ఈ ఫోన్ పై శాంసంగ్ రూ.17,100 తగ్గింపును అందించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.61,900కు తగ్గింది. ఇందులో 6.4 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఎక్సినోస్ 9820 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ గా ఉంది.

​3. శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ(రూ.8,000 తగ్గింపు)

వచ్చే నెలలో ఎస్20 సిరీస్ స్మార్ట్ ఫోన్లు వస్తున్నందుకేమో శాంసంగ్ తన ఎస్10 సిరీస్ లో వచ్చిన అన్ని ఫోన్లపై తగ్గింపును అందించింది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.8,000 తగ్గింపును అందించారు. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.47,900కే అందుబాటులో ఉంది. ఇందులో 5.8 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఎక్సినోస్ 9820 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది.

​4. షియోమీ ఎంఐ ఏ3(రూ.1,000 తగ్గింపు)

గతేడాది ఎంఐ ఏ-సిరీస్ లో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 తగ్గింపును షియోమీ అందించింది. దీంతో ఇందులో 4 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.11,999కు, 6 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.14,999కు లభించనుంది. 6.08 అంగుళాల స్క్రీన్ ను ఇందులో అందించారు. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఇందులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

​5. నోకియా 6.2(రూ.3,500 తగ్గింపు)

నోకియా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.3,500 తగ్గింపును అందించింది. ఈ ధర తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.12,499కే అందుబాటులో ఉంది. ఇందులో 6.3 అంగుళాల హెచ్ డీ+ స్క్రీన్ ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 3,500 ఎంఏహెచ్ గా ఉంది.

​6. నోకియా 7.2(రూ.3,100 తగ్గింపు)

నోకియా తన 7.2 స్మార్ట్ ఫోన్ పై కూడా రూ.3,100 తగ్గింపును అందించింది. ఈ ఫోన్ 4 జీబీ, 6 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,499గా ఉండగా, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,099గా ఉంది. ఇందులో వెనకవైపు ట్రిపుల్ కెమెరా అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కావడం విశేషం.

​7. వివో జెడ్1 ప్రో(రూ.1,000 తగ్గింపు)

వివో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ జెడ్1 ప్రోపై రూ.1,000 తగ్గింపును అందించింది. దీంతో ఇందులో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.12,990గా ఉంది. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.13,990గా ఉంది. ఈ రెండు వేరియంట్లూ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ పై పనిచేయనున్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.

​8. వివో జెడ్1ఎక్స్(రూ.1,000 తగ్గింపు)

వివో తన మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ జెడ్1ఎక్స్ పై కూడా రూ.1,000 తగ్గింపును అందించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.14,990కు వచ్చింది. ఇక 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,990కు తగ్గింది. జెడ్1 ప్రో తరహాలోనే ఈ స్మార్ట్ ఫోన్ కూడా క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ పై పనిచేయనుంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 9.1పై ఈ ఫోన్ పనిచేయనుంది.

​9. ఒప్పో ఏ5 2020(రూ.500 తగ్గింపు)

ఒప్పో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఏ5 2020పై రూ.500 తగ్గింపును అందించింది. గతంలో కూడా ఈ ఫోన్ పై ఒప్పో ధర తగ్గింపును అందించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.11,490కు తగ్గింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది.

​10. ఒప్పో కే1(రూ.1,000 తగ్గింపు)

ఒప్పో ధర తగ్గింపును అందించిన మరో స్మార్ట్ ఫోన్ ఒప్పో కే1. ఈ ఫోన్ పై రూ.1,000 తగ్గింపు లభించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.13,990కే లభించనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 66 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 3,060 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

​11. శాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్(రూ.1,000 తగ్గింపు)

శాంసంగ్ ధర తగ్గింపును అందించిన మిడ్ రేంజ్ ఫోన్ ఇదే. రూ.1,000 తగ్గింపు అనంతరం ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ.14,999కే అందుబాటులో ఉంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉందిద. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ గా ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

​12. శాంసంగ్ గెలాక్సీ ఏ20ఎస్(రూ.1,000 తగ్గింపు)

శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ20ఎస్ స్మార్ట్ ఫోన్ పై కూడా రూ.1,000 తగ్గింపు లభించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.10,999కు వచ్చింది. ఇందులో 6.4 అంగుళాల హెచ్ డీ+ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

​13. షియోమీ రెడ్ మీ గో(రూ.300 తగ్గింపు)

షియోమీ తన బేస్ ఫోన్ అయిన రెడ్ మీ గోపై కూడా తగ్గింపును అందించింది. రూ.300 తగ్గింపు అనంతరం ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ.4,299కే అందుబాటులో ఉంది. ఇందులో 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.4,499గా ఉంది.