Templates by BIGtheme NET
Home >> GADGETS >> ఫిబ్రవరి లో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఇప్పుడే కొత్త ఫోన్ కొనరు!

ఫిబ్రవరి లో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఇప్పుడే కొత్త ఫోన్ కొనరు!


సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి అంటే స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఎంతో ఇష్టమైన నెల. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ నెలలో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతాయి. అదే దారిలో ఈ సంవత్సరం కూడా ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. శాంసంగ్, ఎల్ జీ, సోనీ, ఒప్పో, వివో, షియోమీ, పోకో బ్రాండ్ల నుంచి ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అతిపెద్ద టెక్ షో అయిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానున్న ఫోన్లపై ఓ లుక్కేయండి మరి!

​ఒప్పో రెనో 3 ప్రో

91 మొబైల్స్ నివేదిక మేరకు ఒప్పో రెనో 3 ప్రో స్మార్ట్ ఫోన్ మన దేశంలో ఫిబ్రవరి మూడో వారంలో లాంచ్ కానుంది. డిసెంబర్ లో చైనాలో లాంచ్ అయిన రెనో 3 ప్రోకు కొన్ని మార్పులు చేసి కొత్త వెర్షన్ ను ఇండియాలో లాంచ్ చేయనున్నారు. ఇప్పటిదాకా వచ్చిన సమాచారం మేరకు ఒప్పో రెనో 3 ప్రో ఇండియా వెర్షన్ లో 44 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించనున్నారు. అదే జరిగితే ప్రపంచంలోనే ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది.

చైనాలో లాంచ్ అయిన రెనో 3 ప్రో స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే అందుబాటులో ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ ను ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది.

​వివో సబ్ బ్రాండ్ iQOO స్మార్ట్ ఫోన్లు

ఒప్పో సబ్ బ్రాండ్ గా రియల్ మీ, షియోమీ సబ్ బ్రాండ్ గా పోకో మనదేశంలో ఎంట్రీ ఇచ్చినట్లు వివో కూడా iQOO పేరిట కొత్త సబ్ బ్రాండ్ ను మనదేశంలోకి తీసుకువస్తుంది. మనదేశంలో దీనికి సంబంధించిన మొదటి స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరిలోనే లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను ఉపయోగించనున్నట్లు ఇప్పటికే లీకులు వచ్చాయి. అంతేకాకుండా మనదేశంలో 5జీతో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే కానుందని సమాచారం. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

​శాంసంగ్ గెలాక్సీ ఎం-సిరీస్ స్మార్ట్ ఫోన్లు

శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ లో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే లాంచ్ కానున్నట్లు సమాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎం11, గెలాక్సీ ఎం21, గెలాక్సీ ఎం31 స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఈ జాబితాలో ఎం31 స్మార్ట్ ఫోన్ అత్యంత ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 లేదా ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు గెలాక్సీ ఎం21లో ఎక్సినోస్ 9610 లేదా 9611 ప్రాసెసర్ ను ఉపయోగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక బడ్జెట్ విభాగంలో లాంచ్ అయ్యే ఎం11కు సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. అయితే ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నట్లు తెలుస్తోంది.

​మోటో రేజర్ 2019

మోటో రేజర్ 2019కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మనదేశంలో డిసెంబర్ లోనే ప్రారంభమయ్యాయి. కానీ ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఫిబ్రవరిలోనే దీని లాంచ్ కానుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. దీన్ని గత నవంబర్ లోనే మొదటిసారి ప్రదర్శించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ పై పనిచేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ లో 2,510 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.

​రియల్ మీ సీ3

రియల్ మీ సీ-సిరీస్ లో తర్వాత లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్ ఇదే. ఎంట్రీ లెవల్ ధరల శ్రేణిలోనే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఉండనుంది. ఈ మధ్యే సింగపూర్ ఏజెన్సీ దీన్ని సర్టిఫై చేసింది. కాబట్టి అతి త్వరలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లను గురించిన సమాచారం ఇంతవరకు తెలియరాలేదు. కాకపోతే మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది.

​పోకో ఫోన్

పోకో ఎట్టకేలకు ప్రత్యేక బ్రాండ్ గా తిరిగి మార్కెట్లో అడుగు పెట్టింది. షియోమీ నుంచి విడిపోయి ప్రత్యేక బ్రాండ్ గా రూపొందిన అనంతరం మొదటి ఫోన్ ను ఈ ఫిబ్రవరిలోనే లాంచ్ చేయనుంది. ఇది ఏ ఫోన్ అని ఇంకా స్పష్టంగా తెలియకపోయినా పోకో ఎక్స్2నే ఆ ఫోన్ అని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో రానున్న ఫోన్ పోకో ఎఫ్2 మాత్రం కాదని పోకో ఇండియా జనరల్ మేనేజర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు.

​శాంసంగ్ గెలాక్సీ ఎస్20

శాంసంగ్ నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఫిబ్రవరి 11న న్యూయార్క్ లో లాంచ్ కానున్నాయి. గతేడాది లాంచ్ కానున్న గెలాక్సీ ఎస్10 స్మార్ట్ ఫోన్లకు తర్వాతి వెర్షన్లుగా ఇవి లాంచ్ కానున్నాయి. అయితే పలు కారణాల వల్ల దీనికి ఎస్11 అని కాకుండా ఎస్20 అని పేరు పెట్టారు. ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం ఈ సిరీస్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఎస్20, ఎస్20+, ఎస్20 లైట్ లను శాంసంగ్ ఈ ఈవెంట్లో లాంచ్ చేయనుంది. వీటిలో ఏదో ఒక దాంట్లో 108 మెగా పిక్సెల్ కెమెరాను శాంసంగ అందించే అవకాశం ఉందని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి.

​శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్

గెలాక్సీ ఎస్20 సిరీస్ తో పాటు శాంసంగ్ తన మరో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ను కూడా ఇదే ఈవెంట్లో లాంచ్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి ఫోల్డబుల్ ఫోన్ తరహాలో కాకుండా క్లామ్ షెల్ డిజైన్ ను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. మోటో రేజర్ తరహాలో నిలువుగా మడిచే అవకాశం ఉన్న 6.7 అంగుళాల ఫ్లెక్సిబుల్ డిస్ ప్లేను ఈ ఫోన్ కలిగి ఉందని సమాచారం.

​ఎంఐ 10 సిరీస్

షియోమీ తన అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు అయిన ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లు ఫిబ్రవరి 11న చైనాలో లాంచ్ అవుతాయా? లేదా ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ అవుతాయా? అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టతా రాలేదు. షియోమీ అందించే ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లోనే ఇవి కూడా చేరనున్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించనున్నట్లు కూడా తెలుస్తోంది.

​రియల్ మీ కొత్త ఫోన్

షియోమీ చిరకాల ప్రత్యర్థి అయిన రియల్ మీ కూడా తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను ఉపయోగించనున్నారు. దీన్ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మొదటి సారి ప్రదర్శించనున్నారు. తర్వాత దీన్ని మనదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. రియల్ ఎక్స్2 ప్రోకి తర్వాత వెర్షన్ గా దీన్ని మనదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ గా ఇదే నిలిచే అవకాశం ఉంది.