నటి దీపికా పదుకొనె ఓ వలస కూలీ.. ఆ పథకం కింద లక్షలు స్వాహా!

0

అధికారుల చర్యలు కొన్నిసార్లు మనల్ని బిత్తరపోయేలా చేస్తాయి. అందులోనూ MGNREGS పథకం అంటే అక్రమాల పుట్ట. పేదవాడు తిండికి ఇబ్బంది పడకూడదనే పవిత్ర లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని అక్రమార్కులు అవినీతికి పరాకాష్టగా మార్చారు. మధ్యప్రదేశ్‌లో మరో అడుగు ముందుకేసి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను వలస కూలీగా మార్చేశారు. నవ్విపోదురు గాక మాకేంటీ అన్న చందంగా ఆమె ఫోటోతో జాబ్‌కార్డును రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ పేరుతో ఇప్పటివరకు డ్రా చేసిన లక్షలాది రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనేది అంతుచిక్కని ప్రశ్న.

మధ్యప్రదేశ్‌ ఖర్గోన్‌ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద దీపికా పదుకొనే ఫొటోతో ఉన్న నకిలీ కార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోను శాంతిలాల్‌ పేరుతో ఉన్న కార్డులో దీపిక ఫోటో ఉంది. అంతేకాదు.. ఆ గ్రామంలో 10 మంది కూలీల పేర్లతో ఉన్న జాబ్ కార్డులపై బాలీవుడ్‌ ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. అంటే అవన్నీ నకిలీ కార్డులేనన్నమాట.

పీపర్‌ఖేడనాక గ్రామంలో ఈ నకిలీ కార్డుల బాగోతం బయటకు వచ్చింది. ఈ కార్డులను వినియోగిస్తూ నెల నెలా ఉపాధి హామీ పథకం (Mahatma Gandhi National Rural Employment Guarantee Act) కింద మంజూరయ్యే నగదును పొందుతున్నారు. మనోజ్‌ దూబే అనే పేరుతో ఉన్న నకిలీ కార్డు ద్వారా ప్రతి నెల రూ.30,000 తీసుకుంటున్నట్టుగా జిల్లా అధికారులు ద్వారా తెలిసింది. ఈ నకిలీ కార్డులతో ఇలా లక్షల సొమ్ము స్వాహా చేసినట్టు స్పష్టమవుతోంది.

అయితే.. ఈ కార్డుల్లో పేరున్న వారిని గుర్తించి ప్రశ్నించగా, వారిలో చాలా మందికి వారి ఒరిజినల్ ఫోటోలతో మరో కార్డులు ఉన్నట్లు తేలింది. కొంత మందికైతే ఆ పథకంతో, కార్డులతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కార్డులు ఎవరు చేశారో తమకు తెలియదని శాంతిలాల్ భర్త తెలిపాడు. ఈ కార్డులతో నెల నెలా డబ్బులు ఎవరు తీసుకుంటున్నారనే అంశాన్ని తేల్చడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఏం తేలుస్తారో చూడాలి మరి!