తెలంగాణలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్!

0

తెలంగాణలో రేపటి నుండి రిజిస్ట్రేషన్ పక్రియ ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు నుండి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఈ రోజు ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు సమాచారం.కొత్త రెవెన్యూ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు సీనియర్ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇకపై జరిగే రిజిస్ట్రేషన్లు కొత్త చట్టం ప్రకారం జరగబోతున్నాయి.

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దైంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఈ వ్యవస్థ చరిత్రలో కలిసిపోయింది. విఆర్వో రద్దు తర్వాత సీఎం కేసీఆర్ ఓ ఆదేశమిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారుల దగ్గరున్న ఫైల్స్ రికార్డులు పత్రాలు ఇతరత్రా అన్నీ స్వాధీనం చేసుకోవాలని కరెక్టర్లను ఆదేశాలు వెళ్లాయి. దీనికోసం రోజుల తరబడి సమయం ఇవ్వలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చారు. రిపోర్టులు స్వాధీనం చేసుకున్న కలెక్టర్లు సాయంత్రం 5 గంటలకల్లా పూర్తి వివరాల్ని ప్రభుత్వానికి రిపోర్టు రూపంలో పంపాల్సి ఉంటుంది. సడెన్ గా వచ్చిన ఈ ఆదేశంతో కలెక్టర్లకు టెన్షన్ పెరిగింది. ఆయా గ్రామాల్లోని VROల నుంచి డేటా సేకరిస్తున్నారు.