ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నమ్మకం లేకుంటే మూసేయమనండి!

0

ఏపీ హైకోర్టు ఘాటుగా రియాక్టు అయ్యింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత సంచలన వ్యాఖ్యల్ని ధర్మాసనం చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించిన హైకోర్టు.. చట్టబద్ధ పాలన జరగకపోతే.. తామే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తామని పేర్కొంది. న్యాయమూర్తులను అవమానానికి గురి చేస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. ఎందుకిలా చేసింది? ఏ సందర్భంలో చేసిందనన విషయంలోకి వెళితే..

వివిధ అంశాలపై తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులను.. న్యాయ వ్యవస్థలను కించపరిచేలా కొంతమంది అభ్యంతరకర పోస్టుల పెట్టటంపై తాము ఫిర్యాదు చేసినా సిఐడీ చర్యలు తీసుకోవటం లేదని హైకోర్టు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని.. పోస్టులకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలుజారీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రాకేశ్ కుమార్.. జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే.. సజన్ పూవయ్య.. ముకుల్ రోహత్గీ తదితరులు హాజరయ్యారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పెంపొందించేందుకు తమ వంతు సలహాలు.. సూచనలు ఇస్తామని వారు కోర్టుకు హామీ ఇచ్చారు. మరోవైపు.. పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కుట్రలో భాగంగానే హైకోర్టుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేయటంతో పాటు.. ఇతరుల ప్రభావం లేకుండానే ఎవరూ న్యాయమూర్తులను దూషించరని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న కుట్రల్ని తేలుస్తామని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చటాన్ని సహించమన్నారు.

న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని వారు పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరటం మంచిదన్న ధర్మాసనం.. కోర్టులను దూషిస్తే.. హైకోర్టే పిటిషన్ వేసుకోవాల్సి వచ్చిందన్న ఆవేదనను వ్యక్తం చేయటం గమనార్హం. రాష్ట్ర పోలీసుల తీరు రాష్ట్రానికే తలవంపులు తెస్తుందన్న మండిపాటుతో పాటు.. ‘‘మీది ధనిక రాష్ట్రం కదా. సుప్రీంకోర్టుకు వెళ్లి సీనియర్ లాయర్లను నియమించుకోవచ్చు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై హైకోర్టు ఎంత ఆగ్రహంగా ఉందో ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.