ఫైర్ బ్రాండ్ రోజాకు దిమ్మ తిరిగేలా జగన్ షాకిచ్చారా?

0

ఏపీ అధికారపక్షంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు భారీ షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు. ఊహించని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఆమెకు ఏ మాత్రం మింగుడుపడటం లేదని చెబుతున్నారు. విపక్షంలో ఉన్న నాటి నుంచి జగన్ మీద ఈగ వాలినా ఒప్పుకోని రీతిలో ఫైర్ అయ్యే ఆమెకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

నగరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆర్కే రోజా సొంత నియోజకవర్గంలో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆమెకు.. కేజే కుమార్ కు మధ్య అధిపత్య పోరు నడుస్తుంది. అదెంత తీవ్రంగా ఉందంటే.. ఆ మధ్యన తన నియోజకవర్గంలోని కేబీఆర్ పురం గ్రామ సచివాలయం భూమిపూజకు వెళ్లిన ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను గ్రామంలోకి రాకుండా అడ్డుకోవటమే కాదు.. ఆమె కారు అద్దాల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.

సొంత పార్టీలోని తన వ్యతిరేక వర్గం చేసిన చేష్టలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. కేజే కుమార్ పైన జగన్ కు కంప్లైంట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రోజాకు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. రోజాకు ఏ మాత్రం పడని కేజే కుమార్ సతీమణికి నామినేటెడ్ పోస్టు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల జగన్ సర్కారు.. వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 56 కార్పొరేషన్లను జగన్ ప్రకటించారు. అందులో ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేజే కుమార్ భార్య శాంతిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనపై ఒంటికాలు దువ్వే నేతకు అధినాయకుడు నామినేటెడ్ పదవి ఇవ్వటం ఆర్కే రోజాకు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ నియామకంపై రోజా రియాక్షన్ ఏమిటో చూడాలి.