Templates by BIGtheme NET
Home >> Telugu News >> #GoodMorningCMSir : ఏపీలో గోతుల మధ్య రోడ్లు వెతుక్కోవాలా? నేటి నుంచి పవన్ డిజిటల్ క్యాంపెయిన్.. వెల్లువలా ట్వీట్లు

#GoodMorningCMSir : ఏపీలో గోతుల మధ్య రోడ్లు వెతుక్కోవాలా? నేటి నుంచి పవన్ డిజిటల్ క్యాంపెయిన్.. వెల్లువలా ట్వీట్లు


GoodMorningCMSir: ఆంధ్రప్రదేశ్ లోని గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా భారీ వర్షాలు పడుతుండడంతో రోడ్లు దుస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలా చోట్ల రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయి. దీంతో ఏపీలోని రోడ్ల దుస్థితి తెలిపేలా #Good Morning CM Sir డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీ అరా గోతులు కనిపించడం ఎక్కడైనా సహజం. కానీ ఏపీలో మాత్రం గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి ఉందని జనసేన అభిప్రాయపడుతోంది.

కొన్ని రహదారులను చూస్తుంటే ఏకంగా స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి, కనీస మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని జనసేన నేతలు మండిపడుతున్నారు.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రభుత్వామికి బాధ్యతగా గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో ఇవాళ, రేపు, ఎల్లుండి జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు.

ఆ ఛాలెంజీను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది జనసేన.. 9 వేల 222 కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు మరమ్మతుల కోసం 1,072 కోట్ల రూపాయులు.. కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించింది. కానీ రోడ్ల దుస్థితి అలాగే ఉందన్నది జనసేన ఆరోపణ..

ఓ వైపు ప్రభుత్వం మాత్రం దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయని చెబుతోందని.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉందని.. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయని.. మూగ జీవాలు కదా.. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైసీపీ నాయకులు రోడ్లు వేయడం మానేశారంటూ జనసేన ఆరోపిస్తూ ఈ గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపైన్ ను ప్రారంభించింది.

ఏటా కనీసం 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయాలి. ఈ రోడ్ల మరమ్మత్తు కోసం దాదాపు 1500 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుందని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్, రిపేర్లు చేయాలి. ఇందుకోసం మరో 500 కోట్ల రూపాయలు అదనంగా అవసరం ఉంటుందన్నది జనసేన వాదన.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన కనిపిస్తోంది. తెల్లవారు జాము నుంచే జనసైనికులు వెల్లువలా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఏపీలో రోడ్ల దుస్తితిపై.. జనసేన అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. సీఎం జగన్ కు రోడ్లు అంటే ఏంటో తెలియదని..ఎందుకంటే ఆయన హెలీకాఫ్టర్ లో వెళ్తారు కదా.. అందుకే మనుషులు తిరిగే రోడ్ల గురించి ఆయనకు తెలియదు అంటూ సెటైర్లు వేస్తున్నారు.