Templates by BIGtheme NET
Home >> Telugu News >> కొవిడ్ వ్యాక్సిన్ మీద కేసీఆర్ అంత కుట్ర చేశారట!!

కొవిడ్ వ్యాక్సిన్ మీద కేసీఆర్ అంత కుట్ర చేశారట!!


నరం లేని నాలుక ఏమైనా అంటుందని అంటారు. అందులోకి మాటల మాంత్రికులుగా.. నోటికి వచ్చినట్లు మాట్లాడే దూకుడు రాజకీయ నేతల గురించి.. వారు చేసే వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సమయానికి తగ్గట్లు మాట్లాడటం.. ట్రెండ్ కు తగ్గట్లుగా తిట్టిపోసే అలవాటున్న నేతలకు తగ్గట్లే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఉంటున్నాయి.

అందుకు తగ్గట్లే తాజాగా ఆయన నోటి నుంచి మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుద్దపూస అని ఎవరూ చెప్పరు. అలాఅని లేనిపోని అభాండాలు వేయటం కూడా సరికాదు. ఫాంహౌస్ నుంచి రారు.. ఆయన ఎవరిని కలవరు.. అందరిని కలుపుకుపోయేలా నిర్ణయాలు తీసుకోరు.. మొండిగా ఉంటారు.. తనకు నచ్చినోళ్లకే పదవులు అప్పజెబుతారు.. లాంటి విమర్శలు.. ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు.

కానీ.. తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ పడేలా ఎవరైనా వ్యవహరిస్తారంటూ మాత్రం చూస్తూ ఊరుకునే తత్త్వం ఆయనకు ఉందంటే అస్సలు ఒప్పుకోరు. అందునా తెలంగాణ ఇమేజ్ విశ్వవ్యాప్తం అయ్యే అవకాశాల్ని అస్సలు వదులుకోరు. అయితే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఈ రోజున చేస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఆరోపణలు సరిగా లేవని చెప్పాలి.

ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమే అన్నట్లుగా వ్యవహరించే టీఆర్ఎస్.. మజ్లిస్ నేతలకు తాము మినహాయింపు కాదన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని.. కేసీఆర్ కు వ్యాక్సిన్ రావటం ఇష్టం లేదన్నారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న భారత్ బయోటెక్ కు ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నను సంధించారు బండి సంజయ్.

వరదలు వచ్చినప్పుడు ఫాంహౌస్ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని ఎందుకు రాలేదని ప్రశ్నించే హక్కు లేదన్నారు. వ్యాక్సిన్ రావటం కేసీఆర్ కు ఇష్టం లేదని చెప్పటం ఎంత తప్పో.. వరదల కారణంగా హైదరాబాద్ ఇబ్బందులు పడుతుంటే.. ప్రధాని వచ్చి పరామర్శించలేదనటం కూడా అర్థం లేదని చెప్పక తప్పదు. వ్యాక్సిన్ రాకుండా కేసీఆర్ ఏదో కుట్ర చేసినట్లుగా బండి వ్యాఖ్యానించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.