ట్రంప్ ఆస్తి కరిగిపోయింది..మనోళ్లు మాత్రం కుబేరుల జాబితాలో చేరారు

0

ఆసక్తికర అంశం వెల్లడైంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నేతగానే కాదు.. పెద్ద వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే. కరోనా వేళ.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సంపన్నుల్ని భారీగా దెబ్బ తినటం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చేరారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆయనకు.. ఆస్తుల పరంగానూ భారీగా దెబ్బ పడింది.

కరోనా కారణంగా ట్రంప్ చేసే వ్యాపారాల జోరు తగ్గటంతో.. ఆ ప్రభావం ఆయన సంపద మీద పడింది. తాజాగా విడుదల చేసిన ఫోర్బ్ అమెరికా కుబేరుల జాబితాలో ఆయన స్థానం భారీగా పడిపోయింది. గత ఏడాది ఫోర్భ్స్ జాబితాలో 275వ స్థానంలో ఉన్న ఆయన ర్యాంకు ఈసారి ఏకంగా 352వ ర్యాంకు పడిపోయింది. అంటే.. 77 స్థానాలు దిగజారిపోయారన్న మాట. ఏడాది కాలంలో ట్రంప్ ఆస్తుల విలువ దగ్గర దగ్గర 60 కోట్ల డాలర్ల మేర హరించుకుపోయినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈసారి జాబితాలో ప్రత్యేకత ఏమంటే.. భారత మూలాలున్న అమెరికన్లు పలువురు జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా ఏడుగురు భారత అమెరికన్లు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక.. ఈ జాబితాలో గడిచిన మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్ అధిపతి తన జోరును కొనసాగించారు.
ఏడాది వ్యవధిలో జెఫ్ బెజోస్ ఆస్తులు ఏడాదిలో 57 శాతం పెరిగి 179 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంత భారీగా మరెవరి ఆస్తులు పెరగలేదని చెబుతున్నారు. రెండో స్థానంలో బిల్ గేట్స్.. మూడో స్థానంలో ఫేస్ బుక్ అధిపతి జుకర్ బర్గ్.. నాలుగో స్థానంలో వారెన్ బఫెట్.. ఐదో స్థానంలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నిలిచారు.