20వేల ట్రాక్టర్లతో రైతుల దండయాత్ర.. ఆపాలని సుప్రీంకు కేంద్రం

0

కేంద్రంపై పోరుకు రైతులు రెడీ అయ్యారు. ఏకంగా ట్రాక్టర్ల ర్యాలీతో కేంద్రాన్ని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ఆపివేసేటట్లు చూడాలని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టును కోరింది. కానీ రైతులు మాత్రం వినేలా లేరు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఇప్పటికే రైతు సంఘాలు హెచ్చరించాయి. జనవరి 26న ర్యాలీకి నిర్ణయించాయి.

నిన్ననే సుప్రీంకోర్టు సైతం రైతుల సమస్యను కేంద్రం సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. ఇప్పుడు కేంద్రమే రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు గడప తొక్కడం సంచలనమైంది.

రిపబ్లిక్ డే రాజ్యాంగ చరిత్రాత్మక ప్రాధాన్యం గురించి ఈ ర్యాలీని ఆపాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ఓ అఫిడవిట్ ను సమర్పించింది. ఆ రోజున జరిగే పరేడ్ వంటి కార్యక్రమాలకు ఏ మాత్రం విఘాతం కలిగినా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయిస్తుందనేది ఉత్కంఠగా మారింది.