భారత సరిహద్దులో బర్రెల మంద..చైనా గూఢచారులా?

0

అగ్గిపుల్ల సబ్బు బిళ్ల కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలను వంటబట్టించుకున్న పలు దేశాలు పావురాలు కాకులు గద్దలు వేల్స్ డాల్ఫిన్లుషార్క్ లు పిల్లులు ఉడతలు సీ లయన్స్…ఇలా గూఢచర్యానికి కావేవీ అనర్హం అని అంటున్నాయి. శత్రు దేశాల సమాచారం రాబట్టేందుకు పలు దేశాలు జంతువులతో గూఢచర్యం చేయించిన ఘటనలు కోకొల్లలు. శత్రుదేశాల సైనిక స్థావరాల్లో కీలక ప్రదేశాల్లో ఆయా జంతువులను వేగులుగా ఉపయోగించి పలు దేశాలు సమాచారాన్ని సేకరించిన వైనం తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా భారత్ పై చైనా జడల బర్రెలను గూఢచర్యానికి ఉపయోగించిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం భారత భూభాగంలోకి వచ్చిన 13 జడల బర్రెలు 4 దూడలను చైనా గూఢచర్యానికే పంపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వాటిని చైనాకు భారత సైన్యం అప్పగించి ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

మామూలుగా అయితే జంతువులు పొరపాటున సరిహద్దులు దాటడం కామన్. అయితే కొంతకాలం భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తాజాగా లడఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయన్న అనధికార వార్తల మధ్య ఈ జంతువుల గూఢచర్యం వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆగస్టు 31న జడల గేదెల మంద చైనా భూభాగాన్ని దాటుకొని అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చింది. వారం రోజుల తర్వాత మన సైన్యం వాటిని తిరిగి చైనా యజమానులకు అప్పగించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గూఢచర్యం కోణంలో ప్రచారం జరుగుతోంది. వాటిలో నిఘా పరికరాలను ఉంచారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే జంతువులతో గూఢచర్యం కొత్త కాదు. మన దేశంలో పావురాలు గద్దలను సమాచారాన్ని చేరవేయడానికి గూఢచర్యం చేయడానికి ఉపయోగించేవారు. గత ఏడాది ఏప్రిల్లో నార్వే తీరంలో ఓ బెలుగా వేల్ మెడ చుట్టూ పట్టీ ఉండడంతో రష్యా గూఢచర్యం చేసిందేమో అని అనుమానాలు వచ్చాయి. రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో డాల్ఫిన్లతో రష్యా సబ్మెరైన్లపై మరో సందర్భంలో సీ లయన్స్ తో అమెరికా నిఘా పెట్టింది. ఇజ్రాయెల్ డాల్ఫిన్లను ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని హమాస్ ఆరోపించింది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పావురాలు సైనికుల మధ్య సందేశాలు అందించాయి. పాక్ సరిహద్దుల్లో గూఢచర్యం చేస్తున్న పావురాలను పట్టుకున్న ఘటనలు ఉన్నాయి.

అమెరికా సైన్యం పావురాల తరహాలోనే కాకులను షార్కులను కూడా గూఢచర్యానికి ఉపయోగించుకుంది. సోవియట్ ఎంబసీల్లో సీఐఏ పిల్లులతో ఆడియో రికార్డింగ్ చేయించాలని విఫలమైంది.తమ అణు శుద్ధి ప్లాంట్పై నిఘా కోసం ఇజ్రాయెల్ 14 ఉడుతలను గూఢచర్యం చేసేందుకు పంపిందని ఇరాన్ ఆరోపించింది. పశ్చిమ దేశాలు ఊసరవెల్లులనూ తమ దేశంలోకి పంపుతున్నాయని ఇరాన్ ఆరోపించింది.పెలికాన్ కొంగలతోనూ ఇజ్రాయెల్ గూఢచర్యానికి పాల్పడుతోందని సూడాన్ ఆరోపించింది. అరుదైన బొనేలీ గద్దను గూఢచర్యం అనుమానాలతో లెబనాన్ దళాలు చంపేశాయి. మరి తాజాగా ఈ జడల బర్రెల వెనుక మర్మం ఏమిటన్నది తేలాల్సి ఉంది.