Templates by BIGtheme NET
Home >> Telugu News >> Modi politics: మోడీ చెట్టు నీడలో ఉన్న ఒక్క మిత్రుడు పాయే! 2024లో పరిస్థితేంటి?

Modi politics: మోడీ చెట్టు నీడలో ఉన్న ఒక్క మిత్రుడు పాయే! 2024లో పరిస్థితేంటి?


Modi politics: దేశంలో రాజకీయాలు క్రమంగా బలవంతులకు, బలహీనులకు మధ్య ఫైటింగ్ గా మారుతోంది. దేశంలోనే బలవంతుడిగా మోడీ ఎదుగుతుండగా.. ఆయన చెట్టు నీడలో ఎదగలేకపోతున్నామని.. తొక్కేస్తున్నారని కొందరు నేతలు బయటకు వచ్చేస్తున్నారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో బీజేపీని ఒంటరిగా మార్చేస్తోంది. 2024లో ఇదే ఒంటరితనంతో ప్రజల్లోకి వెళితే.. ఏమాత్రం దూరం పెట్టినా బీజేపీని నమ్మి మద్దతిచ్చే పార్టీలు ఉండవనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి ఉన్న ఒకే ఒక నమ్మకమైన మిత్రుడు.. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తాజాగా మోడీకి రాంరాం చెప్పేశాడు. బీజేపీతో పొత్తు ముగిసిందని స్పష్టం చేశారు. ఎన్డీఏతో పొత్తును రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజకీయ మనుగడకు బీజేపీ నుంచి ముప్పు ఉందని ఆయన చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ప్రధాని మోడీ ఒక మర్రి చెట్టు అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. ఆయన కింద ఏ నాయకుడు ఎదగడన్నది ఇన్ సైడ్ టాక్. కేంద్రంలో మోడీ హవా వచ్చాక సీనియర్లు అందరూ సైడ్ అయిపోయారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి నుంచి నిన్నటి రవిశంకర్ ప్రసాద్, జవదేకర్ లాంటి యాక్టివిస్టులను కూడా రిటైర్ చేయించిన ఘనత మోడీదే. బీజేపీలో ఎవ్వరూ ఎదగకూడదన్నది మోడీ సిద్ధాంతం అంటారు. అందుకే మోడీషాలు తరుచుగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను మారుస్తుంటారని ఓ ప్రచారం ఉంది. కర్ణాటకలో, గుజరాత్ సహా చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది. యూపీలోనూ యోగిని మార్చుదామని చూసినా సాధ్యపడలేదంటారు.

ఇప్పుడు బీహార్ లోనూ నితీష్ ను సీఎం చేసి ఆయనను ఆటబొమ్మను ఆడించినట్టు బీజేపీ ఆడిస్తోందని టాక్. కేంద్ర మంత్రివర్గంలో జేడీయూకు కేవలం ఒక్కటే పదవి ఇచ్చాడు మోడీ. పోనీ బీహార్ ప్రభుత్వంలోనైనా నితీష్ మాట చెల్లుతుందా? అంటే అదీ లేదట.. కనీసం బీజేపీ ఎమ్మెల్యే అయిన స్పీకర్ ను కూడా మార్చలేని నిస్సహాయత సీఎం నితీష్ ది. ఆయనను డమ్మీని చేసి మెజార్టీగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని పాలిస్తున్నారట..

ఇక 2025లో జరిగే బీహార్ అసెంబ్లీకి ముందే నితీష్ ను సీఎం పీఠం నుంచి గద్దెదించి బీజేపీ ఎమ్మెల్యేను బీహార్ ముఖ్యమంత్రిని చేయాలని పావులు కదుపుతున్నారట.. బీహార్ లో బలోపేతం కోసం గ్రౌండ్ వర్క్ చేయడాన్ని నితీష్ జీర్ణించుకోలేకపోయారు. ఇక మహారాష్ట్రలో లాగానే బీహార్లోనూ తనకు ఎసరు తెచ్చేందుకు ఒక ‘ఏక్ నాథ్ షిండే’ను రెడీ చేస్తున్నారని నితీష్ కు ఉప్పందింది. అందుకే ఉన్న ఫళంగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు.

తనకు మద్దతిస్తూనే తన కాళ్లకిందకు నీళ్లు తెస్తున్న బీజేపీ వైఖరిని గమనించిన సీఎం నితీష్ ముందే తేరుకున్నాడు. ఎన్డీఏకు బీజేపీకి గుడ్ బై చెప్పి.. బీహార్ లోని ప్రతిపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లతో జట్టు కట్టారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేసిన నితీష్.. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

ప్రధానంగా ప్రాంతీయ పార్టీల బలహీనత ఏంటంటే.. బలమైన మోడీ తమను మింగేస్తాడని భయపడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును కాజేస్తాడని కంగారుపడుతున్నారు. అందుకే మోడీ చెట్టునీడలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. కేసీఆర్, నితీష్, కేజ్రీవాల్, మమత లాంటి ఇగో ఫీలింగ్ ఉన్న వాళ్లంతా ఇప్పుడు బీజేపీ నుంచి దూరంగా జరుగుతున్నారు. మోడీకి మెజార్టీ కనుక తగ్గితే మాత్రం వీళ్లంతా ఒక్కరోజులో పులులు, సింహాలుగా మారడం ఖాయం. అప్పటివరకూ మనం ఎదురుచూడాల్సిందే తప్ప ఇప్పుడు యాక్టివ్ కావడం మాత్రం కల్ల.

ఈ పరిణామం బీజేపీకి షాకింగ్ గా మారింది. ఇప్పటికే చాలా మంది మిత్రులు బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు నితీష్ ను బీజేపీ దూరం చేసుకుంది. ఏపీలో జగన్ ఉన్నా ఆయనపైనున్న కేసులు.. ఏపీ అభివృద్ధి కోణంలోనే ఆయన ఆగుతున్నారు. బీజేపీకి ఏమాత్రం మెజార్టీ తగ్గినా జగన్ తోకజాడించడం ఖాయం. ఈ క్రమంలోనే మిత్రులను దూరం చేసుకుంటున్న బీజేపీ 2024లో కనుక ఆశించిన మెజార్టీ తగ్గితే మొదటికే మోసం రావడం ఖాయం. బీజేపీ పాలిటిక్స్ ను ప్రాంతీయ పార్టీల నేతలపై ప్రయోగించకుండా కొద్దికాలం మౌనంగా ఉంటేనే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.