పుతిన్ ప్రత్యర్థి మీద విష ప్రయోగం.. అతడెవరంటే?

0

అలెక్సే నావల్నీ పేరు విన్నారా? అంటే తెల్లముఖం పెట్టటం ఖాయం. జనాల నోళ్లలో పెద్దగా నలగని ఈ పేరుకు బదులుగా.. పుతిన్ అన్నంతనే.. ఆ మాత్రం తెలీదా? అన్న మాట చటుక్కున వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకడైన పుతిన్ లాంటి వాడికి అప్పుడప్పుడు చెమటలు పట్టించటం.. చిరాకు తెప్పించే వ్యక్తే అలెక్సే నావల్నీ. నలభై నాలుగేళ్ల ఇతగాడి మీద ఇప్పటివరకు పలుమార్లు హత్యాయత్నాలు.. దాడులు జరిగాయి.

యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తో పాటు.. రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేతగా వ్యవహరించే ఇతను.. రష్యా ఉన్నతాధికారుల అవినీతిని బయటపెడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసే ఇతగాడి మీద తాజాగా విష ప్రయోగం జరిగింది. సైబీరియా నుంచి మాస్కోకు తిరిగి వచ్చే క్రమంలో విమాన ప్రయాణం చేస్తున్నారు. ఫ్లైట్ లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విమానాన్ని ఓమ్ స్క్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేసి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అలెక్సే ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తాజాగా అతనికిచ్చిన టీలో విషం కలిపి ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉదయం టీ తప్పించి మరేమీ తీసుకోలేదని.. వేడి నీళ్లలో ఇచ్చిన తేనీరు కావటంతో విషం మరింత ప్రభావాన్ని చూపిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలోనూ అలెక్సే మీద విష ప్రయోగం జరిగింది.

పుతిన్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన అతనిపై గతంలో పలు కేసులు పెట్టారు. అయితే.. అవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా తేలటంతో జైలు నుంచి విడుదలయ్యారు. పుతిన్ పై నేరుగా విమర్శలు చేయటం.. ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపించటంలో ధైర్యాన్ని ప్రదర్శించే అలెక్సే.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.