స్పుత్నిక్ వీ : ఫలితాలతోనే విమర్శకుల నోర్లు మూయించిన రష్యా !

0

కరోనా మహమ్మారి .. ప్రపంచ దేశాలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారీ ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాక్సిన్ కోసం …. ప్రపంచ దేశాల నిపుణులు అహర్నిశలు కష్టపడుతున్నారు స్పుత్నిక్ వీ పేరుతో రష్యా కరోనా వ్యాక్సిన్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రారంభం పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్నవారందరిలో కరోనా వ్యాక్సిన్ ను నిరోధించే యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని ప్రకటించింది. స్పుత్నిక్-వీ పనితీరుపై విమర్శకులకు ఈ పరీక్షలో వెల్లడైన అంశాలే సమాధానమని రష్యా వెల్లడించింది. ఈ ఏడాది జూన్-జులైలో వ్యాక్సిన్ పై నిర్వహించిన రెండు దశల పరీక్షలో పాల్గొన్న 76 మందిలోనూ కరోనా ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ఏ ఒక్కరిలోనూ తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని లాన్సెట్ వెల్లడించింది.

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ గా చెబుతున్న ఈ వ్యాక్సిన్ కు ఆగస్ట్ లోనే దేశీయ వినియోగానికి రష్యా అనుమతి ఇచ్చింది. కరోనా నుంచి రక్షణ కల్పిస్తూ దీర్ఘకాల భద్రత సమర్ధతల గురించి నిర్ధారణ చేసుకునేందుకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పై భారీస్ధాయిలో సుదీర్ఘ పరీక్షలు అవసరమని లాన్సెట్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ పూర్తిస్దాయిలో పరీక్షలు చేపట్టి అంతర్జాతీయంగా ఆమోదం లభించే వరకూ స్పుత్నిక్ వీని వాడకూడదు అని కొందరు నిపుణులు హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ పత్రిక లాన్సెట్ లో తొలిసారిగా రష్యా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ప్రచురించడం 40000 మందిపై గతవారం పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో తమ వ్యాక్సిన్ పై అనుమానాలు పటాపంచలవుతాయని సీనియర్ రష్యా అధికారి తెలిపారు. ఇంకోవైపు కరోనా నిరోధానికి తొలి వ్యాక్సిన్ ను ప్రకటించిన రష్యా భారీస్ధాయిలో వ్యాక్సిన్ తయారీకి సన్నద్ధమవుతోంది. సంవత్సరం చివరి నాటికి నెలకు 20 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తూ క్రమంగా నెలకు 60 లక్షల డోసులకు సామర్ధ్యాన్ని పెంచుతామని .. పరిశ్రమల మంత్రి డెనిస్ మంతురోవ్ తెలిపారు.