ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!

0

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కరోనా తీవ్రత తగ్గలేదని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో 100 లోపు కరోనా కేసులున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్….ఇపుడు రోజులు 2 వేల కేసులు వస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఉండాలని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేనందున అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి అవసరం లేదన్న ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలు వాయిదా వేశామని రద్దు కాలేదని కాబట్టి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఉండాలని ఈసీ తరఫు న్యాయవాది వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఈసీ అనుమతి తీసుకోవచ్చని ఇప్పటివరకు ఏపీలో జరిగే అభివృద్ధి పనులను ఎన్నడైనా ఈసీ ఆపిందా అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిర్దిష్ట అభివృద్ధి పనులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఆ పనులకు ఎస్ఈసీ అనుమతి నిరాకరిస్తే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలపాటు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.